ఒక్క రూపాయికే ఇడ్లీ.. నీకు ఎంతిచ్చినా తక్కువే తల్లీ.. అమ్మకు ఆనంద్ మహీంద్రా సూపర్ గిప్ట్

దానం చేయాలంటే డబ్బు.. సాయం చేయాలంటే ఒంట్లో ఓపిక ఉండాలంటారు. కానీ ఇవేవీ లేకుండా ఆ అమ్మ అందరికీ వేడి వేడిగా ఇడ్లీ అందిస్తుంది.. అదీ ఒక్కరూపాయికే. కప్పు టీ తాగాలంటే రూ.10 లు ఉంటున్న ఈ రోజుల్లో రూపాయికే ఇడ్లీ ఎలా సాధ్యం. అందునా 60 ఏళ్ల కమలాతల్ స్వయంగా కట్టెల పొయ్యి మీద వండి కస్టమర్స్‌కి అందించడం ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచింది.
ఆరోజునే అమ్మకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. వెంటనే ఆమెకు ఓ గ్యాస్ పొయ్యి కొనిస్తానన్నారు. కానీ భారత్ గ్యాస్ వాళ్లు ఆమెకు స్టౌ, సిలిండర్ అందించారు. ఇప్పుడు మహీంద్రా ఆమెకు ఉండేందుకు ఇల్లు కట్టిస్తున్నారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ ఉదయం ట్విట్టర్‌లో ఈ మంచి విషయాన్నిఅందరితో పంచుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ "ఇడ్లీ అమ్మ"గా రెండేళ్ల క్రితం కమలాతల్ వైరల్ అయ్యారు.
ఇడ్లీలను ఒక్కొక్కటి రూపాయికి అమ్ముతూ ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్నారు ఆమె.
ఈ విషయం తెలిసిన ఆనంద్ మహీంద్రా కమలాతల్ గురించి ట్వీట్ చేశారు. త్వరలోనే "ఇడ్లీ అమ్మ" వ్యాపారంలో తాను పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సూర్యోదయానికి ముందే లేచి శుభ్రంగా స్నానం చేసి శుచిగా ఇడ్లీలను తయారు చేస్తారు. అందులోకి చెట్నీ, సాంబార్ వంటివి తయారు చేసి వేడి వేడిగా అందిస్తారు కస్టమర్స్‌కి. వీటన్నింటినీ ఆమె కట్టెల పొయ్యి మీద చేయడం, వయసుకి మించి కష్టపడడం ఆనంద మహీంద్రాను ఆకట్టుకుంది.
ఆమెకు తాను గ్యాస్ సిలిండర్ పంపిస్తానని మాటిచ్చారు. అయితే ఈలోపే భారత్ గ్యాస్ కోయంబత్తూర్ ఆమెకు ఎల్‌పిజి కనెక్షన్‌ని బహుమతిగా ఇచ్చింది.
"ఇది అద్భుతం. కమలాతల్‌కు మంచి బహుమతిని ఇచ్చినందుకు భారత్ గ్యాస్ కోయంబత్తూర్ వారికి ధన్యవాదాలు అని మహీంద్రా అప్పట్లో ట్వీట్ చేశారు.
తాజాగా ఈ రోజు ఉదయం మహీంద్రా గ్రూప్ ఆమె పేరు మీద కొంత భూమిని రిజిస్టర్ చేయించారు. త్వరలోనే ఇల్లు కట్టిస్తామని చెప్పారు.
మహీంద్రా గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్, మహీంద్రా లైఫ్ స్సేస్ త్వరలో ఆమె ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనుంది.
తమిళనాడు 'ఇడ్లీ అమ్మ' త్వరలో సొంత ఇంటిలో నివసించబోతున్నారు అని ఆనంద్ మహీంద్రా ఆమెకు భూమి పట్టాలను అందజేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ మంచి పనితో ఆనంద్ మహీంద్రా నెటిజన్స్ మనసు దోచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com