పదేళ్ల క్రితం మరణించిన తండ్రి.. కూతురి వివాహ వేడుకలో కనిపించి..
అమ్మానాన్న ఇద్దరూ బిడ్డలకు కొండంత అండ.. ఎంత మంది ఉన్నా ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ వెలితి ఎవరూ తీర్చలేనిది.. ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా ఆ బాధ మనసుని కలవరపెడుతూనే ఉంటుంది. చెల్లెలి వివాహ వేడుకకు నాన్న లేరనే బాధ పెద్దమ్మాయిని కలిచి వేసింది. నాన్న ఉండి ఆశీర్వదిస్తే చెల్లి ఎంతో సంతోషిస్తుందని భావించింది. అనుకున్నదే తడవుగా నాన్న విగ్రహాన్ని తయారు చేయించాలనే ఆలోచన చేసింది.
అచ్చంగా తండ్రి వచ్చి తమ మధ్య ఉన్నట్టే ఉన్న ఆ విగ్రహం ముందు నుంచుని వధూవరులిద్దరు దండలు మార్చుకున్నారు. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోట్టెకు చెందిన సెల్వం పెద్ద పారిశ్రామికవేత్త. ఆయనకు భార్య కళావతి, ముగ్గురు కుమార్తెలు భువనేశ్వరి, దివ్య, లక్ష్మీ ప్రభ ఉన్నారు. తండ్రి అంటే ముగ్గురు కుమార్తెలకు ఎనలేని ప్రేమ. చిన్న కుమార్తె అంటే మరింత ఇష్టం. ముగ్గురూ ఆడపిల్లలే అయినా ఏనాడూ ఆ తండ్రి నిరాశ చెందలేదు. బాగా చదివించారు. కూతుళ్లు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశించారు.
గారాబంగా పెంచడంతో పాటు విలువల్నీ నేర్పారు తల్లిదండ్రులు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. విధి చిన్న చూపు చూడడంతో 2012లో తండ్రి సెల్వం మరణించారు. ఇద్దరు కూతుళ్ల వివాహం ఎనిమిదేళ్ల క్రితం జరిగింది. చిన్న కూతురు లక్ష్మీ ప్రభ అంటే తండ్రికి ఎనలేని ప్రేమ. ఆయన లేని లోటు ఆమెకు తెలియకూడదని భావించిన అక్కచెల్లెళ్లు చెల్లి పెళ్లి నాటికి తండ్రి విగ్రహాన్ని తయారు చేయించాలనుకున్నారు.
బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా తండ్రి నిలువెత్తు సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు. రూ.6 లక్షలు వెచ్చించి సిలికాన్‌తో 5 అడుగులు 7 అంగుళాల ఎత్తులో రూపొందించిన విగ్రహాన్ని కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో తండ్రే స్వయంగా తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించినంత ఆనందపడింది లక్ష్మీ ప్రభ. నాన్నని చూసి ఆనందభాష్పాలు కార్చింది. ఈ ఆలోచన చేసిన అక్కలిద్దరినీ ఆప్యాయంగా హత్తుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com