భారత్‌లో థర్డ్ వేవ్‌కు అవకాశాలు తక్కువే : ఐసీఎంఆర్

కరోనా సెకెండ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేసినా.. ఐసీఎంఆర్ మాత్రం ఛాన్స్ లేదని అంటోంది. ఒకవేళ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని చెబుతోంది.
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఒక వేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని చెబుతోంది. ఇప్పటి పరిస్థితులను, రాబోయే ఉద్ధృతులను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్యనిపుణుల ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు. రోగనిరోధకశక్తి క్షీణించడం, రోగనిరోధకశక్తిని తప్పించుకొనేలా వైరస్‌లో మార్పులు రావడం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో పేర్కొన్నారు.
రెండు సందర్భాల్లోనే మూడో ఉద్ధృతి తలెత్తడానికి ఆవకాశం ఉన్నాయంటున్నారు. మొదటిగా కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగాలి. లేదా సంక్రమణాన్ని తగ్గించగలిగే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలి. ఈ రెండు కారణాల వల్ల ఒక వేళ మూడో వేవ్ వచ్చినప్పటికీ అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. మరోవైపు అన్ని వేరియంట్లపైనా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా సంక్రమిస్తున్న డెల్టా రకం కరోనా వైరస్‌తోపాటు ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లపైనా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
డెల్టా ప్లస్ రకం వైరస్‌పై వీటి ప్రభావం విషయమై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు. కొవాగ్జిన్ టీకా కరోనా తొలిరకంపై ఎంత సమర్థంగా పనిచేస్తోందో అదేస్థాయిలో ఆల్ఫా రకం వైరస్‌పైనా పూర్తి సమర్థతతో పనిచేస్తోందన్నారు బలరాం భార్గవ. ఈ రకంపై కొవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం స్వల్పస్థాయిలో తగ్గుతోందని.. కొద్దితేడాలున్నా కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వైరస్‌లపై బాగా పనిచేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com