Tamilnadu: విషాదం.. ఫ్రిజ్ కంప్రెసర్ పేలి ముగ్గురు మృతి

Refrigerator Blast: చెంగల్‌పేట జిల్లా గుడువాంచెరి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఓ అపార్ట్‌మెంట్‌లో రిఫ్రిజిరేటర్‌లోని కంప్రెసర్ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు.
అపస్మారక స్థితిలో ఉన్న మరో ఇద్దరు కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. మృతులు వి గిరిజ (63), ఆమె సోదరి ఎస్ రాధ (55), వారి సోదరుడు ఎస్ రాజ్ కుమార్ (48)గా గుర్తించారు. రాజ్ కుమార్ భార్య భార్గవి (40), కుమార్తె ఆరాధన (7) చెంగల్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. గిరిజ భర్త వెంకటరమణ గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు.
ఆయన మరణానంతరం గిరిజ తన కొడుకుతో కలిసి దుబాయ్ వెళ్లింది. భర్త మొదటి వర్ధంతి చేయడానికి నవంబర్ 2న గిరిజ దుబాయ్ నుంచి వచ్చింది. ఆమె సోదరుడు, సోదరి కూడా వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది.
పెద్ద శబ్దం వినపడడంతో ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గిరిజ ఇంట్లో నుంచి పొగలు రావడం చూసి తలుపులు పగలగొట్టారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. గిరిజ, రాధ, రాజ్‌కుమార్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com