ఇదెక్కడి గొడవ.. హిందీ వస్తేనే లోన్ ఇస్తానని ఫిట్టింగ్ పెట్టిన బ్యాంక్ మేనేజర్

ఇదెక్కడి గొడవ.. హిందీ వస్తేనే లోన్ ఇస్తానని ఫిట్టింగ్ పెట్టిన బ్యాంక్ మేనేజర్
బ్రాంచ్ మేనేజర్‌‌తో తాను ఎదుర్కొన్న ఇబ్బందికి గాను.. కస్టమర్ లక్ష రూపాయల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపారు.

డాక్యుమెంట్స్ సరిగా లేవనో,, సంతకం సరిగా లేదనో లోన్ ఇవ్వనంటే ఒక అర్థం వుంటుంది. హిందీ మాట్లాడడం రాదని కస్టమర్‌కి లోను ఇవ్వనన్నారు తమిళనాడుకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్. దాంతో జుట్టు పీక్కున్న కస్టమర్ వెళ్లి అధికారులకు కంప్లైంట్ చేయడంతో పాటు నష్ట పరిహారం కూడా కోరారు.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు బ్యాంక్ మేనేజర్‌పై బదిలీ వేటు వేశారు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గంగైకొండచోలపురం బ్రాంచ్‌లో మేనేజర్‌గా ఉన్న విశాల్ కాంబ్లే, పేపర్లు తమిళంలో ఉన్నందున ఒక కస్టమర్ సమర్పించిన పత్రాలను ధృవీకరించడానికి నిరాకరించినట్లు తెలిసింది. విశాల్ నారాయణ్ కాంబ్లేకు ఐఓబి పంపిన సెప్టెంబర్ 21 నాటి అధికారిక కమ్యూనికేషన్ ప్రకారం, అతన్ని త్రిచిలోని బ్యాంకులోని మరొక శాఖకు బదిలీ చేశారు. రుణం కోసం అభ్యర్థిస్తున్న కస్టమర్ తీసుకువచ్చిన పత్రాలను తనిఖీ చేయడానికి నిరాకరించారు.

పది రోజుల క్రితం, ఐఓబికి చెందిన గంగైకొండచోలపురం శాఖకు చెందిన సి సి బాలసుబ్రమణియన్ (76) తన సొంత భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి రుణం కోసం విశాల్‌ను సంప్రదించాడు. బ్యాంక్ మేనేజర్ విశాల్ మహారాష్ట్రకు చెందినవారు. దాంతో అతడికి తమిళ్ తెలియదు బాలసుబ్రమణియన్‌తో హిందీలో సంభాషణ జరపాలనుకున్నారు. కానీ సుబ్రమణియన్‌కు ఇంగ్లీష్, తమిళం మాత్రమే తెలుసు. వచ్చీ రాని భాషలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. భూమి పత్రాలు తమిళంలో ఉన్నందున తాను తనిఖీ చేయలేనని విశాల్ చెప్పారు. తన రుణ దరఖాస్తును కూడా పరిశీలించకుండా తిరస్కరించాడని బాలసుబ్రమణియన్ పేర్కొన్నారు.

రిటైర్డ్ డాక్టర్ అయిన బాలసుబ్రమణియన్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి బ్యాంక్ మేనేజర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. బ్యాంక్ మేనేజర్ కారణంగా తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని రూ .1 లక్షల పరిహారాన్ని కోరారు. భాష తెలియకపోవడంతో రుణం ఇవ్వడానికి నిరాకరించడం సేవల లోపం అని, బ్యాంకు తనకు పరిహారం చెల్లించకపోతే, జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తానని సుబ్రమణియన్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story