మోదీ రైతు చట్టాలను తీసుకొస్తే విపక్షాలు అడ్డుకుంటున్నాయి - కిషన్ రెడ్డి

Kishan Reddy: రాజకీయ కోణంతో కొన్ని రైతు సంఘాలు సాగు చట్టాలను అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉదయం కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ... రైతుల సంక్షేమం కోసం చట్టాలను తీసుకొస్తే విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బీసీల కోసం ప్రత్యేక చట్టాలు చేసిన పార్టీ బీజేపీయేనన్నారు. కేంద్రం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు.
కరోనా విషయంలో ప్రధాని మోదీ అనేక నిర్ణయాలు తీసుకున్నారని.. 56 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. థర్డ్ వేవ్ రాకుండా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సౌకర్యం కల్పిస్తుందని... రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేరు మార్చి తాము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదంపై స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడతామని... సమస్య పరిష్కరిస్తామన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com