Gajendra Singh Shekhawat : పోలవరం పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనన్న కేంద్ర మంత్రి షెకావత్

Gajendra Singh Shekhawat : పోలవరం పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఏపీ సీఎం జగన్‌తో కలిసి ఈరోజు పోలవరంలో పర్యటించారు. ముందుగా దేవీపట్నం మండలం ఇందుకూరు-1 నిర్వాసితుల కాలనీని పరిశీలించారు. పోలవరం నిర్వాసితుల కోసం ఇక్కడ 350 ఇళ్లను నిర్మించారు. ఇందుకూరులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం నిర్వాసితులతో కేంద్రమంత్రి మాట్లాడారు.
ఇందుకూరు నిర్వాసితుల కాలనీ వద్ద ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ... పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని కొనియాడారు. కాలనీలో ప్రభుత్వం చక్కని వసతులు కల్పించిందన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన మాటకు కట్టుబడి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని తేల్చిచెప్పారు. పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు.
పోలవరం ఏపీకి జీవనాడి అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమవుతుందని సీఎం జగన్ అన్నారు. పోలవరం భూ నిర్వాసితులకు ఎకరాకు 5 లక్షల రుపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే చెల్లించిన లక్షన్నరకు తోడు మరో మూడు న్నర లక్షలు ఇస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com