Five States Elections : మళ్లీ కమలమే పవర్ చూపిస్తుందా?

Five States Elections : 5 రాష్ట్రాల ఎన్నికలపై యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది. వీటిలో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడంతో.. మళ్లీ కమలమే పవర్ చూపిస్తుందా.? లేక ప్రతిపక్షాలు పుంజుకుంటాయా.? అన్నది ఆసక్తి రేపుతోంది. పార్టీల అంచనాలు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. యూపీ, పంజాబ్‌లో మాత్రమే క్లియర్ రిజల్ట్స్ వస్తాయి అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో హంగ్ తప్పదని చెబుతున్నాయి.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై గురిపెట్టాయి ప్రధాన పార్టీలు. అయితే ఈసారీ అక్కడ కమలమే పాగా వేస్తుందని.. అంచనా వేస్తోంది ఏబీపీ-సీవోటర్స్ ఒపీనియన్ పోల్. ఉత్తరప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీకి ఈసారి కొన్ని సీట్లు తగ్గినా.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 225 నుంచి 237 సీట్లు సాధిస్తుందని.. సర్వే అంచనా వేస్తోంది.
బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రాకపోయినా.. మునుపటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనా. ఎస్పీ ఈసారి 139 నుంచి 151 సీట్లు గెలుచుకుంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇక దశబ్ధాలపాటు యూపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బీఎస్పీ ఈసారి కనీసం పోటీలో కూడా ఉండదన్నది విశ్లేషణ. ఆ పార్టీ కేవలం 13 నుంచి 21 సీట్లు మాత్రమే సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా 4 నుంచి 8 స్థానాలకే పరిమితం అవుతుందంటున్నాయి.
యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటున్న సర్వేలు.. పంజాబ్‌లో మాత్రం హస్తంకు షాక్ తప్పదంటున్నాయి. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్‌లో.. మెజార్టీ స్థానాలు ఆమ్‌ఆద్మీ పార్టీ దక్కించుకుంటుందన్నది ఏబీపీ-సీవోటర్స్ ఒపీనియన్ పోల్ అంచనా. ఆ రాష్ట్రంలో ఆప్ 55 నుంచి 63 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ 24 నుంచి 30 స్థానాలకు పరిమితం కానుంది. ఇక మరో ప్రధాన పార్టీ శిరోమణి అకాళీదళ్ కూడా 20 నుంచి 26 స్థానాలతో సరిపెట్టుకుని.. కాంగ్రెస్‌తో ప్రతిపక్షంలో నిలవునుంది అన్నది సర్వేల అంచనా. బీజేపీ 3 నుంచి 11 స్థానాలకే పరిమితం అవుతుందని లెక్కలు వేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో హంగ్ తప్పదంటున్నాయి సర్వేలు. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్‌లో అధికారానికి 36 సీట్లు కావాలి. అధికార బీజేపీ 31 నుంచి 37 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేస్తున్న సర్వేలు.. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో 30 నుంచి 36 స్థానాలు దక్కించుకుంటుందని లెక్కలేస్తున్నారు. ఇక అక్కడ ఆప్ 2 నుంచి 4 స్థానాలతో సరిపెట్టుకోనుంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్‌లో బీజేపీ 21 నుంచి 25 స్థానాల్లో గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ 6 నుంచి 10 స్థానాలు దక్కించుకోనుంది.
ఇక బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ కూడా 17 నుంచి 21 స్థానాల్లో గెలుస్తుందన్నది సర్వేల అంచనా. ఇతరులు 8 నుంచి 12 స్థానాల్లో గెలవొచ్చని లెక్కలుకడుతున్నారు. ఉత్తరాఖండ్, మణిపూర్ తరహాలోనే గోవాలోనూ బొటాబొటి ఫలితాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అధికార బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేదన్నది ఒపీనియన్ పోల్స్ అంచనా. 40 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీ 14 నుంచి 18 స్థానాల్లో గెలవనుండగా.. కాంగ్రెస్ 10 నుంచి 14 స్థానాలు సాధిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇక గట్టిపోటీ ఇస్తుందని భావించిన ఆప్.. 4 నుంచి 8 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com