- Home
- /
- అంతర్జాతీయం
- /
- North Korea: ఒక్కరోజే 2 లక్షల 70...
North Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో కీలక పరిణామాలు..

North Korea: ప్రపంచాన్ని ఇన్నాళ్లు కలవరపెట్టిన కరోనాను తరమికొట్టి ఇపుడిపుడే ఆయా దేశాలు ఊపిరిపీల్చుకుంటుంటే.. ఉత్తర కొరియాలో మాత్రం కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఒక్క రోజే 2 లక్షల 70 వేల మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఐతే అనధికారికంగా కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తొలి కేసు బయట పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఉత్తరకొరియాలో 1.48 మిలియన్ల మందిలో కరోనా లక్షణాలు బయట పడ్డాయి. 56 మంది కరోనాకు బలైయ్యారు. ప్రస్తుతం ఆరున్నర లక్షల మందికిపైగా క్వారంటైన్‌లో ఉన్నట్లు ఉత్తర కొరియా అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసును గత వారంలో గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ప్రజలకు మందులను అందించడంలో వైద్యాధికారులు విఫలం కావడంపై ఆయన ఫైర్ అయ్యారు. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. రాజధాని ప్యాంగాంగ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో మందుల సరఫరా ఉధృతం చేశారు. ఇప్పటివరకు ఉత్తరకొరియాలో దాదాపు 15 లక్షల మందికి ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 6 లక్షల 64 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడంతో ఉధృతి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కట్టడికి సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ఆపన్న హస్తం అందిస్తోంది. వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, మాస్కులు, టెస్ట్ కిట్లను పంపిణీ చేస్తోంది. ఉత్తర కొరియా పరిస్థితిపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైరస్ నుంచి తొందర బయటపడాలని ఆకాంక్షిస్తున్నాయి. అవసరమైన సహాయం చేసేందుకు రెడీ అవుతున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com