China Loan Apps: భారతీయులను దోచేస్తున్న చైనా యాప్స్.. ఆఫర్ల పేరుతో..

China Loan Apps: చైనా లోన్ యాప్ సంస్థలు అడ్డగోలుగా భారతీయులను కొల్లగొట్టాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 వేల కోట్లను దోపీడీ చేశాయి. ఒక్క తెలంగాణలోనే రెండు నెలల్లో 300 కోట్లకుపైగా కొల్లగొట్టాయి. ఒక యాప్‌ను గుర్తించేలోపే మరో యాప్‌తో ప్రచారం చేస్తూ ఎరవేస్తున్నాయి. ముంబయికి చెందిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట ఆర్‌బీఐ జారీచేసిన లైసెన్స్‌ను అడ్డం పెట్టుకొని యాప్ ద్వారా చైనా సంస్థ సాగించిన కళ్లుబైర్లు కమ్మే దోపీడీ ఇది.
పీసీఎఫ్‌ఎస్‌లోకి అడ్డదారిలో విదేశీ పెట్టుబడుల్ని రప్పించి మరీ ఆ మేరకు కొల్లగొట్టినట్టు, ఆ సొమ్ముల్ని మళ్లీ దొడ్డిదారిలో చైనా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్ తదితర దేశాలకు తరలించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా గుర్తించింది. అప్పుల మంజూరు, వసూళ్లలో రుణ సంస్థలు అనేక దారుణాలకు పాల్పడినట్టు తేల్చింది. క్యాష్‌బీన్, క్యాష్ బీయింగ్, ఈజీలోన్, లక్కీరుపీ, ఇన్ఫినిటీ క్యాష్, మినిట్ క్యాష్ వంటి యాప్‌ల ద్వారా రుణాలు మంజూరు వ్యవహారం నడిచింది.
ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించి రుణాలు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో దరఖాస్తుదారులకు తెలియకుండానే వారి ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవారు. రుణ మంజూరులో 15-25 శాతం వరకు ప్రాసెసింగ్ రుసుం పేరిట ముందస్తుగానే తీసుకునేవారు. రుణం చెల్లింపునకు కొన్ని సందర్భాల్లో రెండు వారాలనే గడువుగా విధించారు.
కట్టలేని పక్షంలో ఏడాదికి రెండువేల శాతం వడ్డీ వేశారు. అంతమొత్తం కట్టలేని వారిపై వేధింపులకు పాల్పడ్డారు. దాని కోసమే ఏకంగా కాల్‌సెంటర్లనూ ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏడాదిలోనే 11వేల 717 కోట్లు కొల్లగొట్టారు. ఇలా అక్రమంగా దోపీడీ చేసిన సొమ్మును విదేశాలకు తరలించేందుకు లోన్ సంస్థలు కుయుక్తులు పన్నాయని, బోగస్ ఎయిర్‌వే బిల్లులతోపాటు కల్పితమైన క్లౌడ్ సీసీటీవీ స్టోరేజీ అద్దె ఛార్జీ పత్రాలను సృష్టించాయని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
ముంబయిలోని ఎస్‌బీఐ, ఎస్‌బీఎంలకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖల ద్వారా సొమ్మును విదేశాలకు తరలించినట్లు తేలింది. డొల్ల కంపెనీలకు చెందిన 621 బోగస్ ఫామ్-15సీబీ పత్రాలను సృష్టించినట్లు బహిర్గతమైంది. విదేశాల నుంచి సాఫ్ట్‌వేర్లను దిగుమతి చేసినట్లుగా చూపి అందుకోసం చెల్లింపుల పేరిట సొమ్మును చైనా సహా పలు దేశాలకు తరలించారని దర్యాప్తు సంస్థ తేల్చింది.
చైనా రుణ యాప్ సంస్థలకు సూత్రధారి జౌయాహుయి అని ఈడీ గుర్తించింది. ఇతను చైనాలోనే పెద్ద వెబ్‌గేమ్ డెవలపర్ సంస్థ కున్‌లున్ టెక్ కంపెనీ అధిపతి. ఇతడు ఛైర్మన్‌గా ఉన్న గ్రూపులోకే రుణ యాప్‌ల సొమ్ము చేరినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. జౌయాహుయి కు 2.2 బిలియన్ యూఎస్ డాలర్ల ఆస్తులున్నట్లు సమాచారం సేకరించింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com