China Corona: దారుణంగా చైనా పరిస్థితి.. రోజుకు వేలల్లో కరోనా కేసులు..

China Corona: దారుణంగా చైనా పరిస్థితి.. రోజుకు వేలల్లో కరోనా కేసులు..
China Corona: కరోనా విజృంభణతో చైనా వణికిపోతోంది.. ఇప్పటికే ఆదేశంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నాయి.

China Corona: కరోనా విజృంభణతో డ్రాగన్‌ కంట్రీ చైనా వణికిపోతోంది.. ఇప్పటికే ఆదేశంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నాయి. ఇక షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉంది.. అక్కడ రోజూ వేలల్లో కేసులు నమోదవుతుండగా.. భారీగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో రెండున్నర కోట్ల జనాభా ఉన్న ఉన్న షాంఘై గత మూడు వారాలుగా దిగ్బంధంలోనే ఉంది. ఇక తాజాగా మరిన్ని ప్రాంతాల్లో ఆంక్షలకు చైనా అధికారులు సిద్ధమవుతున్నారు.

చైనా రాజధాని బీజింగ్‌లో వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో నగర పరిధిలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. రాజధాని బీజింగ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా 35 లక్షలకుపైగా జనాభా ఉన్న చావోయాంగ్‌లో భారీగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఆ జిల్లా మొత్తం కొవిడ్‌ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకూ మొత్తం 35 లక్షల కరోనా పరీక్షలు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. దీంతో కరోనా టెస్టుల కోసం ప్రజలంతా ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. మరోవైపు అక్కడి కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఇతర ప్రాంతాలను నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలు విధించారు. కేవలం కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తున్నారు. బీజింగ్‌లో ఆంక్షలు కఠినతరం చేస్తోన్న నేపథ్యంలో బీజింగ్‌ మొత్తం లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం, నూడిల్స్‌, కూరగాయలతోపాటు ఇతర ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు నిల్వ చేసుకునేందుకు బీజింగ్‌ వాసులు మార్కెట్లకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో సెంట్రల్‌ బీజింగ్‌లోని సూపర్‌మార్కెట్ల ముందు భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే డిమాండ్‌కు సరిపడా సరుకులు లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story