Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం.. చమురు, వంట నూనెల ధరలపై ప్రభావం..

Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం.. చమురు, వంట నూనెల ధరలపై ప్రభావం..
X
Ukraine Russia: రష్యా బలగాలు మరింత వేగంగా ఉక్రెయిన్‌లో విస్తరించుకుంటూ పోతున్నాయి

Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు.. రష్యా బలగాలు మరింత వేగంగా ఉక్రెయిన్‌లో విస్తరించుకుంటూ పోతున్నాయి.. అయితే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది.. మన దేశంలోని సగటు జీవులు భయపడిపోతున్నాయి.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు ఉపశమించకపోతే, భారత్‌కు ఆ సెగ తగిలేలా ఉంది. సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ సహా దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.

గతేడాది భారత్‌ 1.89 మిలియన్‌ టన్నుల సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచే వచ్చింది. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. మొత్తంగా నెలకు 2 నుంచి 3 లక్షల టన్నుల ఈ నూనె దేశంలోకి దిగుమతి అవుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ నుంచి సరఫరా ఆగిపోయింది. ఉద్రిక్తత మరో 2, 3 వారాలు కొనసాగితే మనకు ఇబ్బంది తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక గోధుమలు కూడా మనం వినియోగిస్తాం.. గోధుమల నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉక్రెయిన్‌ ఉంది.. నల్ల సముద్రం ప్రాంతం నుంచి ఎక్కువగా గోధుమల సరఫరా జరుగుతుంది. రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల వీటి సరఫరా స్తంభిస్తే, గోధుమల ధరలు పెరిగే ప్రమాదం లేకపోలేదు.. ప్రస్తుతం భారత్‌ వద్ద 24.2 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి..

ఇక భారత్‌ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. మన ఎగుమతుల్లో 18 శాతం ఆ దేశానికి వెళ్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టీ ఉత్పత్తిదార్లు, ఎగుమతిదార్లు కలవరపడుతున్నారు. రష్యాపై విధించిన ఆంక్షలతో చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. మరోవైపు మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే పల్లాడియం లోహాన్ని రష్యా ఎక్కువగా ఎగుమతి చేస్తుంది..

రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పల్లాడియం ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌ ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఉద్రిక్తతలు మరింత పెరిగినా, సరఫరా పరంగా ఇబ్బందులుండవు కానీ, ధర ఇంతలా పెరగడం, మరింత పెరిగే అవకాశాలున్నందున దేశీయంగా వినియోగదార్లపై, ద్రవ్యోల్బణం, వృద్ధిపై ప్రభావం చూపొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్‌ తన అవసరాలకు 85 శాతాన్ని దిగుమతి ద్వారానే పొందుతోంది. రష్యా నుంచి మనకొచ్చే చమురు చాలా తక్కువ కాబట్టి రష్యా చమురు ఎగుమతులపై ఇతర దేశాలు ఆంక్షలు విధించినా, మనకు ఇబ్బంది లేదు. మనకు చమురు సరఫరా చేసే సంస్థలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఉన్నాయి. అందువల్ల చమురు, గ్యాస్‌ సరఫరాకు ఏ మాత్రం ఇబ్బంది ఉండబోదనే మాట వినిపిస్తోంది.

Tags

Next Story