Felicity Ace Ship: ప్రమాదానికి గురైన ఫెసిలిటీ ఏస్‌ నౌక.. అందులో 3,965 ఖరీదైన కార్లు..

Felicity Ace Ship: ప్రమాదానికి గురైన ఫెసిలిటీ ఏస్‌ నౌక.. అందులో 3,965 ఖరీదైన కార్లు..
Felicity Ace Ship: భారీ కటైంనర్‌ నౌక ఫెసిలిటీ ఏస్‌ ప్రమాదానికి గురైంది.

Felicity Ace Ship: భారీ కటైంనర్‌ నౌక ఫెసిలిటీ ఏస్‌ ప్రమాదానికి గురైంది. అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలో అజోర్స్‌ ద్వీపాలకు కొద్ది దూరంలో మంటల్లో చిక్కుంది. సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోర్చుగీసు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దిగాయి. 22మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడి సమీపంలోని ప్రాంతానికి తరలించారు. అయితే ఫెసిలిటీ ఏస్‌ నౌక మాత్రం మంటల్లో చిక్కుకుని సముద్రంలో మధ్యలో నిలిచిపోయింది. ఈ నౌకలో పోర్షే, బెంట్లీ, ఆడీ, లాంబోర్గిని లాంటి 3,965 విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూపునకు చెందిన తయారీ కేంద్రంలో పోర్షే, ఆడీ, లాంబోర్గినీ సహా ఫోక్స్‌వ్యాగన్‌ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనికి సమీపంలో ఉన్న ఎండెన్‌ పోర్టు నుంచి వాటిని అమెరికాలోని డావిస్‌విల్లే పోర్టుకు తరలించేందుకు.. నౌక బయలుదేరగా.. మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. పోర్చుగీసు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పినా.. వేల కోట్ల విలువైన లగ్జరీ కార్లతో ఉన్న నౌక మాత్రం మంటల్లో చిక్కుకుపోయింది. మంటలు అదుపు చేసి నౌకను ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఫెసిలిటీ ఏస్‌ నౌకలో 1,100 పోర్షే కార్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. అవి అందాల్సిన వినియోగదారులకు డీలర్ల ద్వారా సమాచారం అందించారు. పోర్షే కార్లు గతంలోనూ ఒకసారి సముద్రంలో మునిగిపోయాయి. 2019లో గ్రాండే అమెరికా నౌక మంటల్లో చిక్కుకుని మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ఆడీ, పోర్షే కార్లు మునిగిపోయాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన ఫెసిలిటీ ఏస్‌ నౌక మూడు ఫుట్‌బాల్‌ స్టేడియంలంత ఉంటుంది. దీంతో ఈ భారీ నౌకను ఓడ్డుకు చేర్చడానికి పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు.

Tags

Next Story