Sri Lanka: శ్రీలంకకు భారత్ సాయం.. 40వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాకు ఏర్పాట్లు ..

Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్న లంకకు మానవతా సాయం కింద 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి బయల్దేరింది. అత్యవసరంగా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసింది. శ్రీలంకకు బియ్యం తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని శ్రీలంకకు పంపుతున్నారు.
ముందుగా 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం శ్రీలంక ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ టెండరు దక్కించుకుంది. ఆ సంస్థ బియ్యం సరఫరాకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా బియ్యానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మానవతా సాయం ప్రకటించింది. బియ్యం సరఫరాకు అయ్యే ఖర్చుకు తాము పూచీగా ఉంటామని, ఆర్థిక భారం భరిస్తామని.. ఆలస్యం కాకుండా వెంటనే బియ్యం ఎగుమతి చేయాలని సదరు సంస్థను ఆదేశించింది. దీంతో బియ్యం ఎగుమతులకు మార్గం సుగమమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com