Ukraine Russia: ఉక్రెయిన్, రష్యా మధ్య పరిస్థితి ఉద్రిక్తం.. రెండు రోజుల్లో 500కు పైగా పేలుళ్లు..

Ukraine Russia: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలకు, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఫిరంగుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోంది. గత రెండు రోజుల్లో దాదాపు 500 పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలు అమెరికా సహా నాటో కూటమిని కలవరపరుస్తున్నాయి.
ఉక్రెయిన్ సైన్యమే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని 2014 నుంచి ఈ ప్రాంతాన్ని అదుపులోకి ఉంచుకొని పాలిస్తున్న రష్యా అనుకూల వేర్పాటువాదులు అంటున్నారు. వీటిని ఉక్రెయిన్ ఖండించింది. చిన్నారుల పాఠశాలపై తిరుగుబాటుదారులు జరిపిన దాడి చిత్రాలను విడుదల చేసింది. ఇందులో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల గోడ ధ్వంసమైంది. వేర్పాటు వాద ప్రభుత్వాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు.
ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోగా.. రష్యా కీలక ప్రకటన చేసింది. అణు బాంబులను మోసుకెళ్లే ఖండాతర, క్రూయిజ్ క్షిపణులతో ఇవాళ సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇందులో ఉక్రెయిన్ సరిహద్దుల్లో క్రిమియా కేంద్రంగా ఉన్న రష్యా నల్లసముద్రపు నావికాదళ యుద్ధనౌకలు కూడా పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి వీక్షించనున్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతోందన్న రష్యా ప్రకటనలను అమెరికా కొట్టిపారేసింది. అసలు.. అమెరికానే ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. దౌత్యపరంగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. ఇక.. ఉక్రెయిన్‌లోని భారత పౌరుల, విద్యార్థుల కోసం వచ్చేవారం ఎయిరిండియా మూడు ప్రత్యేక విమానాలను నడపనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com