Ukraine Russia: ఉక్రెయిన్‌లో చిన్నారుల శరీరాలపై కుటుంబ వివరాలు.. తమకు ఏదైనా జరిగితే..

Ukraine Russia: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా నెలరోజులకు పైగా రష్యా సేనలు మారణకాండను సృష్టిస్తున్నారు. పుతిన్ అధికార దురాహాంకారానికి ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు, అమాయకులు సమిధలుగా మారుతున్నారు. మరికొందరు ఉక్రెయిన్‌ను వదిలి వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. ఇంకొందరు పుట్టిన గడ్డను వదల్లేక చావో బతుకో.. ఏదైనా తమ దేశంలోనే అంటూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బుచా, కీవ్, మరియూపోల్ వంటి పలు నగరాలు శవాల దిబ్బగా మారిపోయాయి. అనేక భవనాలు శిథిలమయ్యాయి. ఆస్పత్రులు, నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. దీనికి తోడు రష్యా సేనలు దురాగతాలకు పాల్పడున్నారు. ఎందరో ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. సామాన్య ప్రజలను ఊచకోత కోస్తున్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దురాగతాలకు అక్కడి సామాన్య ప్రజలు క్షణక్షణం.. భయం భయంగా గడుపుతున్నారు. ఎటుచూసినా కనిపించే అనేక హృదయ విదారక ఘటనలు ప్రపంచదేశాలను కలిచివేస్తున్నాయి. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు.. పిల్లలను కోల్పోయి కన్నీరు పెడుతున్న తల్లుల దీనావస్థ వర్ణనాతీతం. ఈ క్రమంలో తమకు ఏదైనా జరిగితే.. పిల్లలను గుర్తించడానికి వీలుగా వారి శరీరాలపై వివరాలను రాసిపెడుతున్నారు.
ఓ తల్లి తన కూతురి వీపుపై తన తల్లిదండ్రుల వివరాలు, బంధువుల వివరాలు, ఫోన్ నంబర్ రాసింది. ఇంతకన్నా.. ఏం కావాలి.. ఉక్రెయిన్‌లో రష్యా నరమేధాన్ని చెప్పడానికి అని క్యాప్షన్ జతచేశారు. ఈ చిన్నారి వీపుపై తల్లి రాసిన ఈ సిరాక్షరాలను చూసి ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. రష్యా మారణహోమంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ యుద్ధం ముగిసేలోపు ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తోందో అని ప్రపంచం మొత్తం కలవరపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com