Ukraine: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు.. భయాందోళనలో తల్లిదండ్రులు..

Ukraine: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు.. భయాందోళనలో తల్లిదండ్రులు..
X
Ukraine: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారోనని తెలుగు రాష్ట్రాల్లోని..

Ukraine: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారోనని తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా, ఉక్రెయిన్‌లకు చాలామంది కన్సల్టెన్సీల ద్వారా వెళ్తుంటారు. ఇలా ఉక్రెయిన్‌లోనే వేలాది మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు.

తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. స్వదేశానికి రాలేక క్షణక్షణం గండంగా బతుకుతున్నారు. తమను సురక్షితంగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మెడిసిన్‌ విద్య కోసం మూడళ్ల కిందట ఉక్రెయిన్‌కు వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన గంజి భానుప్రసాద్‌, శేషఫణి చంద్ర.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు.

ఎయిర్‌పోర్ట్‌ను రష్యా ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకోవడంతో.. తిరిగి జాఫ్రోజీ కాలేజీకి చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి తమ పిల్లలను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉక్రెయిన్‌లోని బోకోవిన్ యూనివర్సిటీలో చదువుతున్న శ్రీకాకుళం జిల్లా కంబరివలసకు చెందిన మెడికల్ విద్యార్థులు కుమారస్వామి, వంశీకృష్ణ భద్రత పట్ల వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తమ పిల్లలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌ సభ్యుడు రాంమోహన్‌ నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ.. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రష్యాలో ఎంబీబీఎస్‌ చదువుతున్న నల్లొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన అజయ్‌ కూడా అక్కడ చిక్కుకున్నాడు.

యుద్ధ వాతావరణం నెలకొనడంతో రష్యా నుంచి స్వదేశానికి తిరిగిరావడానికి సిద్ధం కాగా, ఆకస్మికంగా రష్యా ప్రభుత్వం విమానాలను నిలిపివేయడంతో అజయ్‌ అక్కడే ఉండిపోయాడు. దీంతో మీర్యాలగూడలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన 20 మంది తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్‌లోని కీవ్‌ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.

విమానాశ్రయంలో అవస్థలు పడుతున్నామంటూ వారి కుటుంబ సభ్యుల ద్వారా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్‌.. వారిని వెంటనే భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఇటు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఏపీ సర్కార్‌ ఇద్దరు అధికారులను నియమించింది.

తెలుగు విద్యార్థులకు సహకారం అందించడానికి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నోడల్‌ అధికారిగా రవిశంకర్‌, అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ గీతేశ్‌ శర్మను నియమించారు. 9871999055, 7531904820 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రప్పించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్‌ గగనతలం మూసివేయడంతో భారతీయ విద్యార్థులందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు ఎవ్వరూ రావద్దని భారత రాయబార కార్యాలయం అలర్ట్‌ చేసింది. వీలైతే పశ్చిమ సరిహద్దు దేశాలతోపాటు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.

Tags

Next Story