Rishi Sunak : బ్రిటన్ ప్రధాని పోటీల్లో రిషి వెనకబడ్డానికి కారణం అదేనా..?
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని పదవి కోసం ఇద్దరి మధ్యా మొన్నటి వరకు టగాఫ్ వార్ కనిపించగా.. మెల్లమెల్లగా పరిస్థితులు మారిపోతున్నాయి.. పోటీ చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో అంచనాలు తలకిందులు అవుతున్నాయి.. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ రేసులో వెనుకబడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సునాక్ కంటే లిజ్ ట్రస్‌కు అవకాశాలు గణనీయంగా పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో 90శాతం విజయావకాశాలు లిజ్ ట్రస్ వైపే ఉన్నాయని అక్కడి లోకల్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ స్మార్కెట్స్ అంచనా వేసింది.
బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎన్నిక కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ ఈ ఎన్నిక ప్రక్రియను చేపట్టింది.. ఫస్ట్ రౌండ్‌లో 11 మంది పోటీలో కనిపించగా.. ఫైనల్ రౌండ్‌కు వచ్చేసరికి రిషి సునాక్, లిజ్ ట్రస్ మాత్రమే నిలిచారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు సునాక్, ట్రస్ మధ్య విజయావకాశాలు 60-40గా ఉన్నాయి.. కానీ, తర్వాత పరిణామాలు ట్రస్‌కు అనుకూలంగా మారుతూ వచ్చాయి..
పోటీ మొదలైనప్పటి నుంచి రిషి సునాక్ గెలుస్తారని అంచనా వేశారు.. టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు పలు నగరాల్లో ఫేస్ టు ఫేస్ చర్చల్లో పాల్గొన్నారు.. అయితే, టీవీ ఛానెళ్ల చర్చాగోష్టుల్లో సీన్ మారిపోయింది.. ట్రస్ ప్రసంగాలు ఈ అంచనాలను అదిగమించేలా చేశాయి.. డిబేట్లలో రిషి సునాక్‌ను లిజ్ ట్రస్ వెనక్కు నెట్టేసినట్లుగా తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ఆకట్టుకునే రీతిలో ఆమె ప్రసంగాలు ఉన్నట్లుగా సమాచారం.
బ్రిటన్‌లో అర్హులైన కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య లక్షా 75వేల వరకు ఉంది.. ఇటు మెజారిటీ ఎంపీలు సునాక్‌కే మద్దతుగా నిలిచినప్పటికీ ఎక్కువ మంది టోరీ సభ్యుల మద్దతు మాత్రం ట్రస్ వైపే కనబడుతోంది.. అయితే, కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతునూ చూరగొన్నవారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు..
వచ్చేవారం నుంచి టోరీ సభ్యులకు బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుంది.. సెప్టెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న ఫలితాలు వెలువడుతాయి. అయితే, రోజురోజుకూ పరిణామాలు మారిపోతున్న నేపథ్యంలో ఫైనల్‌గా విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒకవేళ ఈ పోటీలో రిషీ సునాక్ విజయం సాధిస్తే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com