Russia: రష్యా చరిత్రలో ప్రత్యేకమైన రోజు.. ఇప్పటికైనా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిసేనా..?

Russia: రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు. రష్యా తన మిలటరీ సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద సైనిక పెరేడ్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ తేదీన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక మలుపు తిప్పుతారని, అధికారంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని దశల వారీగా స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. విక్టరీ డే నాడు పుతిన్ సంచలన ప్రకటన చేస్తారన్న అంచనాలున్నాయి. మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.
విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మారియుపోల్ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనమని పేర్కొంటోంది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ అని చెబుతూ వస్తున్న పుతిన్ ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి సాధారణ రష్యన్లని కూడా యుద్ధోన్ముఖుల్ని చేయడమే ఆయన ముందున్న లక్ష్యమని కొందరు అంచనా వేస్తున్నారు.
అలాగే విక్టరీ డే ప్రసంగంలో పుతిన్ మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తారన్న ఊహాగానాలున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎన్నికల నిర్వహణ రద్దవుతుంది. అధికారాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్ల వయసు నిండిన యువకులందరూ అవసరమైతే కదనరంగానికి వెళ్లాల్సి వస్తుంది. వారు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తే రాజకీయంగా పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది.
రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్‌ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. తూర్పున డోన్బాస్‌లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్‌క్‌లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com