Russia: అణుబాంబులతో రష్యా బెదిరింపులు.. అలర్ట్‌గా ఉండడం మంచిదంటూ..

Russia: రష్యా అణుబాంబు బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దంటోంది ప్రపంచం. ఇప్పటికే పుతిన్ తన కుటుంబ సభ్యులను సైబీరియాలోని న్యూక్లియర్ బంకర్లకు తరలించినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో న్యూక్లియర్ వార్‌కు సన్నద్ధంగా ఉండాలని రష్యన్ ఆర్మీకి పుతిన్ ఇచ్చిన ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నారు. ఇప్పటికే బారెంట్స్ సముద్రంలో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు, సైబీరియాలో మొబైల్ మిస్సైల్ లాంచర్లతో రష్యా విన్యాసాలు చేస్తోంది. ఏ క్షణమైనా జలాంతర్గాములతో అణుబాంబులు వేయడానికి సిద్ధంగా ఉండేందుకు రష్యా డ్రిల్స్ చేస్తోంది.
కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా సిద్ధంగా ఉంచడమే ఈ విన్యాసాల లక్ష్యమని రష్యా ప్రకటించింది. ఇప్పటికే సైబీరియాలోని ఇర్కుత్స్క్ అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను, సైనిక బలగాలు తరలించినట్లు రష్యా తెలిపింది. అయితే, అమెరికా మాత్రం అణుబాంబు బెదిరింపులను పట్టించుకోనక్కర్లేదని చెబుతోంది. అమెరికన్లు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని జో బైడెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అటు నాటో కూడా రష్యా అణు విన్యాసాలపై స్పందించింది. అలర్ట్‌గా ఉండడం కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాలాగా విన్యాసాలు చేయనక్కర్లేదని, ఆ విషయంలో మార్పులేం అవసరం లేదని నాటో తెలిపింది. అంటే, న్యూక్లియర్ వార్‌కు రష్యా తెగించకపోవచ్చని, ఒకవేళ అణుబాంబులతో దాడి చేద్దామనుకున్నా.. నాటో దేశాలన్నీ అందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com