Ukraine Russia: నో ఫ్లై జోన్‌ విధించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడి విన్నపం.. పుతిన్ రిప్లై..

Ukraine Russia: నో ఫ్లై జోన్‌ విధించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడి విన్నపం.. పుతిన్ రిప్లై..
Ukraine Russia: ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.

Ukraine Russia: ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతోంది.. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.. ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్‌ విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్‌ నాటో దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేశారు..

రష్యా వైమానిక దాడుల నుంచి తమ ప్రజలను కాపాడేందుకు నో ఫ్లైజోన్‌ విధించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొరపెట్టుకుంటున్నా నాటో కూటమి అందుకు ససేమిరా అంటోంది.. ఉక్రెయిన్‌ ఇలా కోరిందో లేదో.. వెంటనే దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు.. ఉక్రెయిన్‌ గగనతలాన్ని ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌ విధించినా.. అలా విధించాలని కోరినా యుద్ధంలో భాగమైనట్టేనని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌పై నో ఫ్లైజోన్‌కు ఛాన్స్‌ ఉందా..? రష్యాను ఎదుర్కొనే శక్తి నాటో దళాలకు ఉన్నప్పటికీ నో ఫ్లైజోన్‌కు ఎందుకు నిరాకరిస్తున్నాయి..? నో ఫ్లైజోన్‌ అమలు చేయడంలో వచ్చే ఇబ్బందులేంటి..? అణుయుద్ధం తలెత్తే ప్రమాదం ఉందనే పశ్చిమ దేశాలు నో ఫ్లైజోన్‌కు నిరాకరిస్తున్నాయా..? అయితే, ఏ దేశమైనా పర్టిక్యులర్‌ ప్లేస్‌ను నో ఫ్లైజోన్‌గా ప్రకటించగానే సరిపోదు.. దాని అమలు కోసం ఆయుధ వ్యవస్థలను మోహరించాల్సి ఉంటుంది..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో నో ఫ్లైజోన్‌ అమలు చేయాలంటే నాటో దేశాలు వందల సంఖ్యలో ఫైటర్‌ జెట్లు, అవాక్స్‌ విమానాలతోపాటు రాడార్లను మోహరించాల్సి ఉంటుంది.. చుట్టుపక్కల ఉన్న రష్యన్‌ వైమానిక దళ సాధన సంపత్తి, ఎస్‌400 వంటి అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు, ఆదేశిక వ్యవస్థలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది.

నాటో కూటమికి రష్యాను ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌ విజ్ఞప్తిని తిరస్కరించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.. రష్యాతో పోలిస్తే నాటో దళాల వద్ద మెరుగైన యుద్ధ విమానాలు ఉన్నాయి. గగనతలంలో అవి ఆధిపత్యాన్ని ప్రదర్శించగలవు. ఒకవేళ ఉక్రెయిన్‌పై నాటో కూటమి నో ఫ్లైజోన్‌ అమలు చేస్తే రష్యా వాయుసేన దాన్ని సవాల్‌ చేస్తుంది.

రష్యాను నిరోధించేందుకు నాటో దళాల ప్రయత్నాలతో యుద్ధానికి తెరతీసినట్లుగా భావించాల్సి ఉంటుంది.. ఇది తీవ్ర ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది.. అటు తమ జోలికి వస్తే అణుఆయుధాలతో దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటికే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో.. నో ఫ్లైజోన్‌ విధిస్తే అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.

అయితే, గతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నో ఫ్లైజోన్‌ విధించిన సందర్భాలు ఉన్నాయి.. 1991లో మొదటి గల్ఫ్‌ యుద్ధం తర్వాత అమెరికా దాని మిత్రపక్షాలు ఇరాక్‌లోని రెండు ప్రాంతాల్లో నో ఫ్లైజోన్‌ విధించాయి.. అయితే, దీనికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపలేదు.. 1992లో బాల్కన్‌ పోరు సమయంలో బోస్నియా గగన తలంలోకి సైనిక విమానాల రాకపోకలను నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది.

దీనిని నాటో దళాలు అమలు చేశాయి.. ఇక 2011లో గడాఫీ దళాలు పౌరులపై దాడిచేయకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లిబియాలో నో ఫ్లైజోన్‌ విధించింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో నో ఫ్లైజోన్‌ విధించడం సాధ్యం కాదంటున్నాయి నాటో దేశాలు.

Tags

Read MoreRead Less
Next Story