Ukraine Russia: ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన రష్యా సైన్యం..

Ukraine Russia: ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన రష్యా సైన్యం..
Ukraine Russia: ఉక్రెయిన్, రష్యా మధ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది.

Ukraine Russia: ఉక్రెయిన్, రష్యా మధ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఇరుదేశాల సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాయి. అగ్రదేశం అమెరికా వార్నింగ్‌ను పెడచెవిన పెట్టిన రష్యా.. తన సైన్యాన్ని ఉక్రెయిన్‌ సరిహద్దులో భారీగా మోహరించడం ఉద్రిక్తతలకు తావిస్తోంది. తన త్రివిధ దళాలతో ఉక్రెయిన్ ను అష్టదిగ్భందంచేసింది. దీంతో ఏ క్షణాన్నైనా ఉక్రెయిన్ పై దాడి జరిగే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

దీంతో తమ దేశ పౌరులను ఉక్రెయిన్ వీడాలని ఆదేశాలు జారీచేశాయి. అయితే ఉక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా పూర్తిస్థాయిలో సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఉపగ్రహ చాయా చిత్రాలు ఇందుకు బలం చేకూర్చాయి. ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు మూడు వైపుల నుంచి సైనిక మోహరింపులను రష్యా చేసినట్లు వెల్లడైంది. క్రిమియా, బెలారస్‌తోపాటు తూర్పు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో సైనిక పదఘట్టనలు, యుద్ధ ట్యాంకుల రొదలు, శతఘ్ని, క్షిపణి దళాల కదలికలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్‌లోని దొనెస్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై రష్యా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ ఉక్రెయిన్‌ దళాలకు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య 2014 నుంచి పోరు సాగుతోంది. తూర్పు ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరువలో తన సైనిక బలగాన్ని రష్యా పెంచుకుంటోంది. దీంతో ఈ ప్రాంతం గుండానే సైనిక చర్యను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్యాలోని యెల్న్యాలో ఉన్న భారీ సైనిక స్థావరంలో 2021 చివర్లో దాదాపు 700 ట్యాంకులు, పదాతిదళ పోరాట శకటాలు, శతఘ్నులు, బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్లు ఉండేవి. ఈ శిబిరం చాలావరకూ ఖాళీ కావడంతో వాటిని.. దేశ సరిహద్దుకు తరలించినట్లు అర్ధమవుతోంది. అక్కడి ఆయుధ సామగ్రిని రైలు, రోడ్డు మార్గంలో బ్రయాన్స్క్‌ ప్రాంతానికి తరలించినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈశాన్య ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లోని కర్స్క్‌, బెల్గోరాడ్‌ ఓబ్లాస్ట్స్‌ ప్రాంతాల్లోనూ సైనిక కదలికలు భారీగా పెరిగాయి. రష్యాకు చెందిన బలమైన దళం 'ఫస్ట్‌ గార్డ్స్‌ ట్యాంక్‌ ఆర్మీ' సాధారణంగా మాస్కో ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు అది ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు అనువైన మార్గంలో మోహరించడం దాడికి సర్వసన్నద్దమైనట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.

బెలారస్‌కు రష్యాకు మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడానికి ఈ దేశాన్ని కూడా రష్యా ఉపయోగించుకునే వీలుంది. బెలారస్‌లో ఇప్పటికే మోహరింపులను పెంచింది. 30వేల మంది సైనికులు, స్పెట్స్‌నాజ్‌ ప్రత్యేక బలగాలు, సుఖోయ్‌-35 సహా పలు రకాల యుద్ధవిమానాలు, ఇస్కాందర్‌ క్షిపణులు, ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ వంటివి ఇందులో ఉన్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత బెలారస్‌లో ఇంత భారీగా రష్యా సైనిక మోహరింపులు జరగలేదు. రెండు దేశాల సైన్యాలు గత రెండురోజులుగా యుద్ధవిన్యాసాలు నిర్వహించడం విశేషం రష్యా ఎప్పుడైనా దాడికి దిగే ప్రమాదం ఉందని అమెరికా నిఘావర్గాల హెచ్చరికలతో కొన్ని సంస్థలు ఉక్రెయిన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి.

ఉక్రెయిన్‌కు వెళ్లే తమ విమానాలపై ఆంక్షలు విధించినట్లు డచ్‌ ఎయిర్‌లైన్‌ కేఎల్‌మ్‌ తెలిపింది. స్కైఅప్‌ సంస్థ కూడా.. పోర్చుగల్‌లోని మదేరా నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళుతున్న విమానాన్ని మాల్దోవాకు మళ్లించింది. ఉక్రెయిన్‌ మాత్రం తమ గగనతలాన్ని మూసివేయలేదని స్పష్టం చేసింది. అమెరికా సహా పలు ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి.

Tags

Read MoreRead Less
Next Story