Ukraine Russia: ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర పోరు.. యుద్ధం ఆపేదే లేదంటూ..

Ukraine Russia: అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్ తగ్గడం లేదు. తమ టార్గెట్ పూర్తయ్యే వరకు.. యుద్ధం ఆపేది లేదని రష్యా తెగేసి చెబుతుంటే ఉక్రెయిన్ సైతం అంతే ధీటుగా సమాధానం ఇస్తోంది. రష్యా సేనలతో తమ దళాలు దైర్యంగా పోరాడుతున్నాయని.. రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇరుదేశాలు పట్టుదలగా ఉండటంతో.. యుద్ధం భీకరంగా సాగుతోంది.
మరోవైపు.. ఖార్కివ్‌లో కర్ణాటకకు చెందిన వైద్యవిద్యార్ధి నవీన్ మృతి చెందాడు. ఖార్కీవ్‌లోని తన అపార్ట్‌మెంట్‌మెంట్ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్న సమయంలో.. రష్యా బాంబు దాడిలో నవీన్ చనిపోయాడు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ వెల్లడించింది. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
నవీన్ మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపింది. మరోవైపు.. నవీన్ మరణాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్న.. భారత్ విదేశాంగ శాఖ.. రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో మాట్లాడింది. తక్షణం భారతీయులంతా క్షేమంగా బయటకు వచ్చే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసింది. అటు.. ఉక్రెయిన్‌లో చనిపోయిన నవీన్ గురించి ప్రధాని మోదీతో మాట్లాడినట్మలు తెలిపారు కర్ణాటక సీఎం బొమ్మై. ప్రధాని మోదీ.. నవీన్ తల్లిదండ్రులతోనూ మాట్లాడినట్లు తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత ఉద్ధృతంగా కొనసాగుతుండంతో అక్కడి భారతీయుల్ని స్వదేశానికి తలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులను తరలించే విషయంపై స్లోవేకియాతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు కేంద్రమంత్రి కిరణ్ రీజిజు. వీసాల జారీ విషయంలో వారి సాయాన్ని కోరుతామన్నారు.
విద్యార్ధులను క్షేమంగా తీసుకురావడే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. భారతీయ విద్యార్ధుల తరలింపు కొనసాగుతోందన్న ఆయన.. మిగిలిన వారిని సైతం.. క్షేమంగా తీసుకొస్తామన్నారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్దం ముదురుతుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీవ్‌ను భారతీయులు వెంటనే విడిచివెళ్లాలని ఆదేశించింది. విద్యార్థులతో పాటు భారతీయులందరూ ఇవాళే అత్యవసరంగా కీవ్ నగరాన్ని వదిలివెళ్లాలని భారత ఎంబసీ సూచించింది.
అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా బయటపడాలని తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ గంగా పేరుతో ఇప్పటికే స్వదేశానికి తీసుకొస్తోంది. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com