Ukraine Russia: త్వరలోనే జెలెన్ స్కీ- పుతిన్ మధ్య చర్చలు.. దీంతో యుద్ధం ఆగేనా..?

Ukraine Russia: నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 20 రోజుల తర్వాత తొలిసారి జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చల్లో పురోగతి చోటుచేసుకుంది. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరు దేశాలూ ముందుకొచ్చాయి. కీవ్, చెర్న్‌హివ్ నగరాల్లో దాడులు తగ్గించేందుకు క్రెమ్లిన్ అంగీకరించింది.
ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, భవిష్యత్తు చర్చలకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని రష్యా వెల్లడించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మూడు గంటలపాటు రష్యా-ఉక్రెయిన్ చర్చలు సాగిన తర్వాత ఈ అంగీకారం కుదిరింది. అంతకముందు పలుమార్లు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియగా.. మంగళవారం జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి.
కీవ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక చర్యను ఆరంభించి నెలకు పైనే అయింది. ఈ చర్యతో లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు ఆశ్రయం కోల్పోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో దాదాపు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం చర్చల్లో పురోగతి కాస్త ఉపశమనం కల్గించేదే.
ఈ చర్చల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. కీవ్, చెర్న్‌హివ్ ప్రాంతాల నుంచి పుతిన్ సేనలు వెళ్లిపోయినట్టు ప్రకటించాయి. ఈ చర్చల్లో కాల్పుల ఉపసంహరణ, ఉక్రెయిన్ భద్రత అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిపాయి. అటు రష్యాకు అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది.
కేవలం కొన్ని డ్రోన్లు, 30 మంది సిబ్బందిని ఉపయోగించి రష్యాకు చెందిన భారీ కాన్వాయ్ ను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్ ను డ్రోన్లకు అనుసంధానించి జరిపిన ఈ దాడుల్లో 65 కిలోమీటర్ల మేర రష్యా సైనిక కాన్వాయ్ ధ్వంసం అయినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది.. రష్యా సైనిక కాన్వాయ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను దిగ్బంధనం చేసేందుకు వస్తుండగా ఈ దాడి జరిగింది.
ఈ దాడులను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ దళం ఏరో రిజ్విడా చేపట్టింది. 30 మంది మెరికల్లాంటి డ్రోన్ ఆపరేటర్లు బైక్ లపై రష్యా కాన్వాయ్ కి చేరువగా వెళ్లారు. డ్రోన్లకు అమర్చిన బాంబులను గురితప్పకుండా రష్యా కాన్వాయ్ లోని యుద్ధ ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలపై జారవిడిచారు. ఈ ఆపరేషన్ రాత్రివేళ జరిగినట్టు ఏరో రిజ్విడా వెల్లడించింది.. మరోవైపు, తాజా పరిణామాలపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీకి చెందిన నేతలతో చర్చించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com