Mariupol: శ్మశాన వాటికగా మారిన ఉక్రెయిన్ టూరిస్ట్ ప్లేస్ మరియుపోల్..

Mariupol: రష్యా దాడిలో అందమైన నగరాలు శ్మశాన వాటికలుగా మారిపోయాయి. సముద్రతీర ప్రాంతమైన మరియుపోల్‌నైతే ఏకంగా ఊచకోత కోసేసింది రష్యా. బడి గుడి అనే తేడా లేకుండా బిల్డింగులన్నింటినీ నేలమట్టం చేసింది. 90 శాతం నగరం ధ్వంసం అయింది. ముఖ్యంగా నివాస ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసింది. రిపైర్ చేసుకోడానికి వీల్లేనంత దారుణంగా ఇళ్లను పడగొట్టేసింది రష్యా.
మరియుపోల్‌లో లక్షల మంది జనాలకు నిలువ నీడలేదు. అందుకే తలదాచుకునేందుకు థియేటర్‌లోకి వెళ్తే.. దానిపైనా మిస్సైల్స్‌తో దాడి చేసి నేలమట్టం చేసింది రష్యా. ఆ సమయంలో థియేటర్లో 1200 మంది ఉన్నారు. ఇప్పటికీ, శిథిలాల కిందనే శవాలు పోగులుగా పడిఉన్నాయి. పోనీ, మరియుపోల్ నుంచి పారిపోదామన్నా వీల్లేకుండా రష్యా బలగాలు చుట్టుముట్టాయి.
మరియుపోల్‌లో రెండు వారాలకుపైగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో తాగునీటికి, ఒక్కపూట తిండికి నానా అవస్థలు పడుతున్నారు. అసలే చలిదేశం.. కరెంట్, గ్యాస్ లేకపోయే సరికి రాత్రిళ్లు గడ్డకట్టుకుపోయే పరిస్థితుల్లో బతుకుతున్నారు. చివరికి మరియుపోల్‌తో ఇతర ప్రాంతాలకు కమ్యూనికేషన్ వ్యవస్థనే లేకుండా చేసింది రష్యా. దీంతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు మరియుపోల్ వాసులు.
రష్యా బలగాల కళ్లుగప్పి 30వేల మంది మరియుపోల్ నుంచి బయటపడ్డారు. ఇంకా మూడున్నర లక్షల మంది అక్కడే చిక్కుకుపోయారు. నిత్యం కాల్పులు జరుపుతూనే ఉండడంతో నగరం విడిచి వెళ్లలేని పరిస్థితి ఉంది. చివరికి మరియుపోల్‌కు మనవతాసాయం చేయడానికి కూడా అనుమతించడం లేదు రష్యా. దీంతో మరియుపోల్ ప్రజలు అత్యంత దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు.
మరియుపోల్‌లో ఉన్న కిరాణా షాపులను నేలకూల్చారు, కొన్నింటిని తగలబెట్టారు. అయినా సరే.. అక్కడే ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతుక్కుంటున్నారు మరియుపోల్ జనాలు. గోడౌన్లలో మిగిలిపోయి ఉన్న సరుకులను తెచ్చుకుని అరకొరగా కడుపు నింపుకుంటున్నారు. ఒకప్పుడు దర్జాగా, సంతోషంగా బతికిన ఈ తీరప్రాంత ప్రజలు.. నిలువ నీడలేని మహానగరంలో, ఒక్క బ్రెడ్ ముక్క కోసం పడిగాపులు పడుతూ బతుకీడుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com