Vladimir Putin: మేము నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కితగ్గం: పుతిన్

Vladimir Putin (tv5news.in)
Vladimir Putin: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు నరమేధానికి, అకృత్యాలకు పాల్పడ్డాయన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ ముగిసేది.. పోరాట తీవ్రతను బట్టే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై, పాశ్చాత్య దేశాల ఆరోపణలపై పుతిన్ ఈ రేంజ్‌లో బహిరంగంగా స్పందించడం ఇదే మొదటిసారి.
ఉక్రెయిన్‌లో తమ లక్ష్యసాధనలో నష్టం స్వల్పంగా ఉండాలనే రష్యా కోరుకుందని ఆయన అన్నారు. అయితే పరిస్థితులు అందుకు విఘాతం కలిగించాయని పుతిన్ చెప్పుకొచ్చారు. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు బెడిసి కొట్టాయని, రష్యా తట్టుకుని నిలబడగలిగిందని, పైగా అది వాళ్లకు ఎదురుదెబ్బగా పరిణమించిందని పుతిన్ అభివర్ణించారు. రష్యా, బెలారస్‌ల ఆంక్షలతో మరింత ఇరకాటం పెట్టే ప్రయత్నాలు చేశారని, ఇలాంటి సమయంలో ఇరు దేశాల సమగ్రతను పెంచడం చాలా ముఖ్యమని పుతిన్ అన్నారు.
ఇక బుచా మారణహోమాన్ని.. ఫేక్‌గా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్,ఉక్రెయిన్ గడ్డపై రష్యా బలగాలు నరమేధానికి పాల్పడిందనే ఆరోపణలు తోసిపుచ్చారు. డిమాండ్‌ల విషయంలో ఉక్రెయిన్ అస్థిరత్వం వల్లే శాంతి చర్చల పురోగతి మందగిస్తుందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ తూర్పు దాడికి కట్టుబడి ఉన్నందున మాస్కో తన సైనిక దూకుడును కొనసాగిస్తుందన్నారు. ఉత్తమ యుద్ధ లక్ష్యాలన్నింటిలో విజయం సాధిస్తుందని పుతిన్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
అటు రష్యా దళాలు కీవ్, ఇతర ప్రధాన నగరాల నుంచి వెనక్కి మళ్లి ఉక్రెయిన్ తూర్పు దక్షిణ ప్రాంతంపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇజ్యూమ్ నగరం వద్దకు మాస్కో సేనలు తరలివస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈశాన్య డాన్‌బాస్ ప్రాంతంలోకి రష్యా బలగాలు మళ్లీ చేరుకొంటున్నట్లు తెలుస్తోంది. రష్యా సైనిక వాహన శ్రేణి సరిహద్దుల నుంచి పశ్చిమ భాగంలో కదులుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మొత్తం ఎనిమిది మైళ్ల కాన్వాయ్‌లో కమాండ్ కంట్రోలింగ్ విభాగాలు, సపోర్టింగ్ బెటాలియన్లు, హెలికాఫ్టర్ల రక్షణ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. డాన్‌బాస్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. దీనికి ఉత్తరాన డొనెట్స్క్, మేరియుపోల్, తూర్పున డెనిపర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ నగరాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకొన్నాయి. ప్రస్తుతం దాడులకు లాంఛింగ్ పాయింట్‌గా ఈ ప్రాంతాన్ని వాడుకొంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com