Corona Cases: ప్రపంచ దేశాలకు డబ్యూహెచ్ఓ హెచ్చరిక.. కరోనా కేసులు పెరుగుతాయంటూ..

Corona Cases: కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగుతోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా...మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాను స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో అత్యధికంగా 5వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుదలతో చైనా అలర్ట్ అయ్యింది. 13 ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. జిలిన్, చాంగ్‌చున్, షెన్ ఝెన్, షాంఘై, లాంగ్‌ఫాంగ్ వంటి నగరాల్లో ఆంక్షలు విధించారు.
బీజింగ్‌తో పాటు, షాంఘైకి విమానాల రాకపోకలను రద్దు చేశారు. అటు దక్షిణ కొరియాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులుగా గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి దక్షిణకొరియాలో అత్యధిక మరణాలు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
సౌత్ కోరియాలో మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలు దాటింది. మళ్లీ వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది. అంతా అప్రమత్తంగా ఉండాలని.. టెస్టులు, జీనోమ్ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com