8th Pay Commission : కేంద్రం నుంచి భారీ గిఫ్ట్.. 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే పండగ.

8th Pay Commission : కేంద్రం నుంచి భారీ గిఫ్ట్.. 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే పండగ.
X

8th Pay Commission : దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 50.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు ఒక భారీ తీపి కబురు అందబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ వేతన సంఘం తన మధ్యంతర నివేదికను డిసెంబర్ 2026 నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు భారీగా పెరిగేందుకు మార్గం సుగమం కానుంది. కేవలం జీతాల పెంపే కాకుండా, ఇతర అలవెన్సులు కూడా పెరగనుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 28, 2025న ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. నివేదిక ఇవ్వడానికి 18 నెలల గడువు ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన సంకేతాల ప్రకారం.. నిర్ణీత గడువు కంటే ముందే మధ్యంతర నివేదిక వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఉద్యోగుల పనితీరు, ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలో జరగనున్న జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను తుదిసారిగా కేంద్రం ముందు ఉంచనున్నాయి.

ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందనేది ప్రధానంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. 7వ వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉంది, దీనివల్ల అప్పట్లో బేసిక్ పే సుమారు 14 నుంచి 16 శాతం పెరిగింది. అయితే ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.86 వరకు ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. ఈసారి జీతాల పెంపు 20 శాతం నుంచి 35 శాతం వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉంటే, ప్రస్తుతం రూ.18,000 ఉన్న కనీస వేతనం ఏకంగా రూ.51,480 వరకు పెరిగే అవకాశం ఉంది.

వేర్వేరు పే-లెవల్స్‌లో ఉన్న ఉద్యోగులకు వేర్వేరుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. లెవల్ 1 నుంచి లెవల్ 18 వరకు ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా జీతంలో మార్పులు వస్తాయి. ఉదాహరణకు, ప్రస్తుతం రూ.21,700 బేసిక్ పే తీసుకుంటున్న లెవల్ 3 ఉద్యోగికి కొత్త వేతన సంఘం అమలైతే అది రూ.62,000 దాటవచ్చు. అదేవిధంగా అత్యున్నత స్థాయిలో ఉన్న క్యాబినెట్ సెక్రటరీ జీతం రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. కింది స్థాయి ఉద్యోగులకు శాతాల వారీగా ఎక్కువ లాభం కలిగేలా, పై స్థాయి అధికారులకు భారీ వేతనాలు అందేలా ఈ కొత్త రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు పెన్షనర్లకు కూడా ఈ 8వ వేతన సంఘం గొప్ప వరం కానుంది. సర్వీసులో ఉన్నప్పుడే కాకుండా, పదవీ విరమణ తర్వాత కూడా గౌరవప్రదమైన జీవనం సాగించడానికి అవసరమైన విధంగా పెన్షన్ పెంపును సిఫార్సు చేయాలని కమిటీ యోచిస్తోంది. అయితే ఉద్యోగ సంఘాల నాయకుడు శివగోపాల్ మిశ్రా అభిప్రాయం ప్రకారం.. 7వ వేతన సంఘం నాటి బెంచ్‌మార్క్ కంటే ఏమాత్రం తక్కువ కాకుండా ఈసారి పెంపు ఉండాలి. అప్పుడే పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి మధ్యతరగతి ఉద్యోగులకు ఊరట లభిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.

Tags

Next Story