Tech Layoffs : టెక్ రంగంలో ఏఐ ప్రకంపనలు.. 5 నెలల్లోనే 93 వేల మందికి ఉద్వాసన.

Tech Layoffs : టెక్ రంగంలో ఏఐ ప్రకంపనలు.. 5 నెలల్లోనే 93 వేల మందికి ఉద్వాసన.
X

Tech Layoffs : సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులు లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ రాకతో కంపెనీలు తమ టీమ్స్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాయి. 2026 ప్రారంభంలోనే టెక్ ప్రపంచం భారీ లేఆఫ్స్‌తో వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పరంపర కొనసాగుతోంది. 2026 మొదటి ఐదు నెలల్లోనే దాదాపు 106 కంపెనీలు 93,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ప్రధానంగా ఫ్రెష్‌వర్క్స్, కాయిన్‌బేస్, మెటా వంటి దిగ్గజ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐ, ఆటోమేషన్‌ను ఆయుధంగా వాడుకుంటున్నాయి. టీమ్స్ పునర్వ్యవస్థీకరణ పేరుతో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నాయి.

భారత ఐటీ రంగంపై ప్రభావం

భారతీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటి సంస్థల్లో కూడా సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY26) ఈ కంపెనీల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 6,981 మంది తగ్గుదల నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 12,718 మంది కొత్తగా చేరగా, ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వడం గమనార్హం. ఇది భారతీయ ఐటీ నిపుణులలో ఆందోళన కలిగిస్తోంది.

ఏయే రంగాల్లో కోతలు ఎక్కువ?

లేఆఫ్స్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ Layoffs.fyi ప్రకారం.. ఎక్కువ కోతలు కన్స్యూమర్ సెక్టార్‌లో జరిగాయి. మెటా, పింట్రెస్ట్ వంటి 23 కంపెనీలు కలిసి దాదాపు 14,705 ఉద్యోగాలను తొలగించాయి. ఆ తర్వాత ఫైనాన్స్ రంగంలో 17 కంపెనీలు సుమారు 5,097 మందికి ఉద్వాసన పలికాయి. ముఖ్యంగా ఒరాకిల్ (Oracle) సంస్థ ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తీసేయగా, అందులో 10,000 మంది భారతీయులే ఉండటం గమనార్హం.

ముఖ్య కంపెనీల పరిస్థితి

* మెటా : దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి మార్క్ జుకర్‌బర్గ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది వారి మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతానికి సమానం.

* ఫ్రెష్‌వర్క్స్ : తమ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతూ, గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 11 శాతం (సుమారు 500 మంది) మందిని తొలగిస్తోంది.

* కాయిన్‌బేస్ : క్రిప్టో మార్కెట్ అస్థిరత, ఏఐ వినియోగం కారణంగా 14 శాతం మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు సీఈఓ బ్రయన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రకటించారు.

* స్నాప్‌చాట్ & ఒరాకిల్: స్నాప్‌చాట్ 1,000 మందిని, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తమ మొత్తం స్టాఫ్‌లో 10 శాతం మందిని తొలగించాయి.

Tags

Next Story