AI Warning : సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. వచ్చే 18 నెలల్లో ఊడిపోనున్న జాబ్స్.

AI Warning : సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. వచ్చే 18 నెలల్లో ఊడిపోనున్న జాబ్స్.
X

AI Warning : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఉద్యోగాలను ఊడ్చేస్తుందని ఇప్పటిదాకా విన్నాం.. కానీ ఆ భవిష్యత్తు ఇప్పుడు మన కళ్ళ ముందే ఉందంటున్నారు మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్. కేవలం మరో 12 నుంచి 18 నెలల్లోనే ఆఫీసుల్లో కూర్చుని చేసే వైట్ కాలర్ జాబ్స్ సగానికి పైగా రోబోలే చేసేస్తాయని ఆయన బాంబు పేల్చారు. సాధారణంగా ఏఐ అంటే మనకు మెయిల్స్ రాసి పెట్టడమో, ఫోటోలు ఎడిట్ చేయడమో అనుకుంటాం. కానీ మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ చెప్తున్న దాని ప్రకారం.. కంపెనీ ఇప్పుడు "ప్రొఫెషనల్ గ్రేడ్ ఏజీఐ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అంటే మనిషి తన మేధస్సుతో, అనుభవంతో చేసే సంక్లిష్టమైన పనులను ఏఐ అచ్చం మనిషిలాగే పూర్తి చేయగలదు.

ఇప్పటివరకు మనం చాట్ జీపీటీని ఒక అసిస్టెంట్‌లా వాడుతున్నాం. కానీ త్వరలోనే ఏఐ ఏజెంట్లు రాబోతున్నాయి. ఇవి కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేస్తాయి. ఉదాహరణకు, ఒక కంపెనీకి సంబంధించిన లీగల్ కాంట్రాక్టులు తయారు చేయడం, అకౌంట్స్ లెక్కలు వేయడం, మార్కెటింగ్ ప్లాన్స్ గీయడం వంటివి ఈ ఏజెంట్లు ఎవరి సాయం లేకుండానే ఫినిష్ చేస్తాయి. రాబోయే రెండేళ్లలో మన సొంత ఏఐ మోడల్ తయారు చేసుకోవడం ఒక బ్లాగ్ రాయడం అంత ఈజీ అయిపోతుందని సులేమాన్ జోస్యం చెప్పారు.

సులేమాన్ మాటలు ఏదో భయపెట్టడానికి చెప్పినవి కావు, ఇప్పటికే క్షేత్రస్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రముఖ కంపెనీ సేల్స్‌ఫోర్స్ ఏఐ అడాప్షన్ పేరుతో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్, ఫెడెక్స్, ఎరిక్సన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఏఐ వైపు మళ్లుతూ తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని ఏఐతో చేయించుకోవచ్చని కంపెనీలు భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.

ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ తన ఏఐ అవసరాల కోసం ఓపెన్ ఏఐ మీద ఆధారపడింది. కానీ ఇకపై అలా కాకుండా సొంతంగా ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2026 ప్రారంభం నాటికి మైక్రోసాఫ్ట్ తయారు చేసిన సొంత ఏఐ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాబోతున్నాయి. దీనివల్ల ఏఐ రంగంలో పోటీ పెరగడమే కాకుండా, ఆఫీసుల్లో మనుషుల అవసరం ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

Tags

Next Story