ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఎనిమిది, పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35వేలకు పైగా జీతం

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఎనిమిది, పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35వేలకు పైగా జీతం
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారి కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారి కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్ట్ 16 నుంచి 31 వరకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఫిజికల్, మెడికల్, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం స్టైఫండ్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల నుంచే సుమారు రూ.35 వేల వేతనంతో పాటు ప్రోత్సాహకాలు ఉంటాయి.

ఆర్మీలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి ప్రాంతాలవారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి స్థానికులకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఈ పోస్టుల్లో చేరిన వారికి లెవెల్-3 మూల వేతనం రూ.21,700తో పాటు రూ.5200 మిలటరీ సర్వీస్ పే పొందవచ్చు. వీటితో పాటు డీఏ, హెచ్‌ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అందువల్ల వీరికి మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం లభిస్తుంది. భవిష్యత్తులో వీరు దశలవారీ సిపాయ్, నాయక్, హవల్దార్, నయీబ్ సుబేదార్, సుబేదార్, సుబేదార్ మేజర్ హోదా వరకు చేరుకోవచ్చు. 15 ఏళ్లు ఆర్మీలో పని చేస్తే జీవితాంతం పూర్తి పింఛను పొందవచ్చు.

ఈ నియామకాలు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వారితో పాటు యానాం పరిధిలోని వారు ఇందులో పాల్గొనవచ్చు. ఇతర ప్రాంతాల వారికి అవకాశం లేదు. ప్రస్తుతం వీటి కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివరాలు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 3

ర్యాలీ : ఆగస్ట్ 16 నుంచి 31 వరకు

వేదిక: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం

వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/

Tags

Read MoreRead Less
Next Story