EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా.

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా.
X

EPFO : దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కళ్లు చెదిరే వార్త చెప్పింది. ఇకపై మీ పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీ కాబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ (2026) నుంచి నేరుగా మీ మొబైల్‌లోని UPI ద్వారా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని తీసుకురాబోతున్నారు. దేశంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ తమ పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం అంటే ఒక పెద్ద ప్రహసనం. నెలల తరబడి వేచి చూడటం, ఫామ్స్ నింపడం వంటి ఇబ్బందులు ఇక ఉండవు. వచ్చే ఏప్రిల్ 2026 నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన యూపీఐ ఐడీ ద్వారా పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. అంటే మీరు షాపులో పేమెంట్ చేసినట్టే, యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీ పీఎఫ్ నుంచి అర్హత ఉన్న మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకోవచ్చు. దీనివల్ల సుమారు 8 కోట్ల మంది సభ్యులకు అత్యవసర సమయాల్లో నగదు లభ్యత పెరుగుతుంది.

కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న చిన్నపాటి సాంకేతిక లోపాలను సరిదిద్దుతున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం.. సభ్యునికి ఎంత మొత్తం విత్ డ్రా చేసుకునే అర్హత ఉందో అది ముందే స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే, భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని అకౌంట్లో లాక్ చేసి, మిగిలిన డబ్బును మాత్రమే యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

గతంలో పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కావడానికి వారాల సమయం పట్టేది. కానీ ఇప్పటికే ఆటో-సెటిల్మెంట్ ద్వారా 3 రోజుల్లోనే డబ్బులు వస్తున్నాయి. గతంలో ఈ లిమిట్ లక్ష రూపాయలు ఉండగా, ప్రభుత్వం దానిని 5 లక్షల రూపాయలకు పెంచింది. అలాగే 2025 అక్టోబర్‌లో పీఎఫ్ నిబంధనలను మరింత సరళతరం చేస్తూ, 13 రకాల క్లిష్టమైన రూల్స్‌ను కేవలం మూడు కేటగిరీల (అనారోగ్యం, విద్య/పెళ్లి, ఇల్లు/ప్రత్యేక పరిస్థితులు) కిందకు తెచ్చారు. దీనివల్ల డాక్యుమెంటేషన్ తలనొప్పి చాలా వరకు తగ్గింది.

కొత్త నిబంధనల ప్రకారం.. పిల్లల చదువు కోసం 10 సార్లు, పెళ్లిళ్ల కోసం 5 సార్లు పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అయితే కనీసం 12 నెలల సర్వీస్ ఉండాలి. ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచడం వల్ల వార్షిక 8.25 శాతం వడ్డీ మరియు కాంపౌండింగ్ ప్రయోజనం సభ్యులకు అందుతూనే ఉంటుంది. మొత్తం మీద పీఎఫ్ వ్యవస్థను టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ చర్యలు ఉద్యోగుల పాలిట వరంగా మారనున్నాయి.

Tags

Next Story