8th Pay Commission : ఉద్యోగుల జీతాలు 14% నుంచి 54% వరకు పెరుగుతాయా? DA విలీనంపై కేంద్రం కీలక ప్రకటన.

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన వార్త ఇది. ప్రస్తుతం ఉద్యోగులకు ఇచ్చే డీఏను వారి బేసిక సాలరీలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 1, 2025 న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియను మాత్రం నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతం ఎంత మేరకు పెరిగే అవకాశం ఉందనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం.
8వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వాస్తవ వేతనం 14% నుంచి 54% వరకు పెరగవచ్చని అంచనా. అయితే 54% పెరుగుదల వచ్చే అవకాశం తక్కువగా భావిస్తున్నారు.
ఈ అంచనాలు గ్రేడ్ పే 1900, 2400, 4600, 7600, 8900 లకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92, 2.57 గా పరిగణనలోకి తీసుకుని తయారు చేస్తారు. ఈ అంచనాలలో HRA 24%, TA రూ.3,600-రూ.7,200, NPS 10%, CGHS ఫీజులు కూడా చేర్చుతారు. ప్రభుత్వం ఈ వేతన పెరుగుదలను దేశంలో వినియోగం పెంచే చర్యగా కూడా ఉపయోగించుకోవచ్చని ఒక నివేదిక పేర్కొంది.
డీఏ అనేది ఉద్యోగులను పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్. ఉద్యోగుల జీతం అసలు విలువను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్వహించడం DA ముఖ్య ఉద్దేశం. డీఏ రేటు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరించబడుతుంది. ప్రస్తుతం DA 58% ఉంది. అంటే, లక్ష రూపాయలు బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగికి డీఏ రూపంలో రూ.58,000 లభిస్తుంది.
ఉద్యోగుల సంఘాలు డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. డీఏను బేసిక్ శాలరీలో కలిపితే, తదుపరి అలవెన్స్‌ల పెరుగుదల సమయంలో పెరిగిన బేసిక్ సాలరీ పై మొత్తం జీతం పెరుగుతుంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం డీఏను నేరుగా బేసిక్ శాలరీలో విలీనం చేసే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టంగా ప్రకటించింది.
ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు నోటిఫికేషన్‌ను నవంబర్ 3, 2025న జారీ చేసింది. ఈ కమిషన్ సిఫార్సులు అమలులోకి వస్తే ఉద్యోగుల బేసిక్ సాలరీ, అలవెన్స్‌లు మారుతాయి. డీఏను బేసిక్‌లో విలీనం చేయకపోయినా, ఈ కమిషన్ సిఫార్సుల ద్వారా ఉద్యోగులు తమ తదుపరి జీతం పెరుగుదలలో ప్రయోజనం పొందుతారు. దీర్ఘకాలంలో ఇది ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

