Cost of US Education : మరింత భారంగా విదేశీ విద్య.. అమెరికాలో చదివితే రూ.10 కోట్లు కావాలా ?

Cost of US Education : మరింత భారంగా విదేశీ విద్య.. అమెరికాలో చదివితే రూ.10 కోట్లు కావాలా ?
X

Cost of US Education : భారతదేశంలో డాలర్‎తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పడిపోతున్న నేపథ్యంలో.. విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, ఎడెల్‌వైస్ ఎండీ, సీఈఓ అయిన రాధికా గుప్తా.. రూపాయి 90 స్థాయికి చేరుకోగానే అంతర్జాతీయ విద్య అసలు ఖర్చు పై ప్రజలు ఆలోచించాలని కోరారు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో చదువుకోవడానికి, నేటి యువతరం తల్లిదండ్రులు రూ.10 కోట్ల ఫండ్‌ను లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

15 ఏళ్లలో రూ.10 కోట్లు ఎలా?

విదేశాల్లో విద్య ఖర్చు అనేది కేవలం ఫీజులకు మాత్రమే పరిమితం కాదు. ఇందులో వసతి, బీమా, ప్రయాణం, డాలర్లలో చెల్లించే ప్రతి చిన్న ఖర్చు కూడా కలుస్తుంది. రాధికా గుప్తా తన సొంత లెక్కల ద్వారా ఈ విషయాన్ని వివరించారు. ప్రస్తుతం అమెరికన్ డిగ్రీకి దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చవుతుందని ఆమె అంచనా వేశారు. ఈ ఖర్చుపై ప్రతి సంవత్సరం 5% చొప్పున ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ (విద్య ద్రవ్యోల్బణం), డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో 4% చొప్పున వార్షిక పతనం ఉంటుందని అంచనా వేశారు. ఈ రెండు అంశాలను కలిపితే 15-16 సంవత్సరాల తర్వాత ఇదే డిగ్రీ ఖర్చు సుమారు రూ.10 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.

అంతర్జాతీయ ఆస్తుల్లో పెట్టుబడి ఎందుకు?

భారతదేశం ఎగుమతి-స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించడానికి రూపాయిని బలహీనంగా ఉంచాల్సిన అవసరం ఉందని రాధికా గుప్తా నొక్కి చెప్పారు. అందుకే భవిష్యత్తును అంచనా వేయలేకపోయినా, సిద్ధంగా ఉండడం ముఖ్యం. డాలర్లలో చేయాల్సిన ఖర్చు కోసం రూపాయిల్లో పెట్టుబడి పెట్టడం అంటే ఎల్లప్పుడూ రిస్క్ తీసుకోవడమే అని ఆమె వాదించారు. అందుకే భారతీయ కుటుంబాలు తప్పనిసరిగా తమ పెట్టుబడిలో కొంత భాగాన్ని అంతర్జాతీయ ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని ఆమె గట్టిగా సలహా ఇచ్చారు.

Tags

Next Story