EPFO : పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్..వడ్డీ రేటు తగ్గించనున్న ఈపీఎఫ్ఓ.

EPFO : ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి షాకింగ్ న్యూస్ అందేలా కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటును తగ్గించే దిశగా కసరత్తు జరుగుతోంది. కోట్లాది మంది చందాదారుల భవిష్యత్తుపై ప్రభావం చూపబోయే ఈ నిర్ణయంపై వచ్చే నెలలో స్పష్టత రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకు ఈసారి చేదు వార్త చెప్పే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుతమున్న 8.25 శాతం నుంచి 8.00 - 8.20 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. మార్చి మొదటి వారంలో జరగనున్న 239వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈపీఎఫ్ఓ వద్ద ఉన్న నిధులపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, భవిష్యత్తులో చెల్లింపులకు ఇబ్బంది కలగకుండా ఫైనాన్షియల్ బఫర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కోత విధించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వడ్డీ రేట్ల తగ్గింపుకు రాజకీయ సెగ తగిలేలా ఉంది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఓటర్లలో ప్రతికూలత వస్తుందని కేంద్రం భావిస్తోంది. అందుకే, రాజకీయ ఒత్తిడి వల్ల వడ్డీ రేట్లను తగ్గించకుండా యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం కూడా ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ వడ్డీ రేటును తగ్గిస్తే, అది లక్షలాది మంది ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపుపై ప్రభావం చూపుతుంది.
ఈ సమావేశంలో మరో కీలకమైన అంశం వేతన పరిమితి పెంపు. ప్రస్తుతం పీఎఫ్ పరిధిలోకి రావాలంటే నెలకు రూ.15,000 లోపు జీతం ఉండాలనే నిబంధన ఉంది. దీనిని రూ.25,000కి పెంచాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. 2014 నుంచి ఈ లిమిట్ మారకపోవడం, ఈ మధ్య కాలంలో ధరలు, కనీస వేతనాలు పెరగడంతో చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ పరిధి నుంచి బయటకు వెళ్ళిపోయారు. దీనిపై బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంటే, మరో కోటి మందికి పైగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి చివరలో జరిగే ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ భేటీతో మొదలవుతుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీబీటీ వడ్డీ రేటును ఖరారు చేస్తుంది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే, కార్మిక శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సాధారణంగా ఏటా జూన్ లేదా జూలై మాసం నాటికి ఈ వడ్డీ సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది. పీఎఫ్ వడ్డీ తగ్గితే అది దీర్ఘకాలికంగా ఉద్యోగుల పొదుపు మొత్తాన్ని భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
