EPFO Pension : ప్రైవేట్ ఉద్యోగులకు షాక్..పెన్షన్ రూ.7,500 చేసే ప్రతిపాదన లేదన్న కేంద్రం.

EPFO Pension : ప్రైవేట్ ఉద్యోగులకు షాక్..పెన్షన్ రూ.7,500 చేసే ప్రతిపాదన లేదన్న కేంద్రం.
X

EPFO Pension : EPS-95 పథకం కింద ప్రైవేట్ ఉద్యోగులకు కనీస పెన్షన్ నెలకు రూ.1,000 నుంచి రూ.7,500 కు పెరిగే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. కానీ డిసెంబర్ 1, 2025 న పార్లమెంట్‌లో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. ఈ సమాధానంతో కనీస పెన్షన్ రూ.7,500 అవుతుందనుకున్న 80 లక్షల మంది వృద్ధుల ఆశలు ప్రస్తుతానికి అడియాశలయ్యాయి.

డిఎ ఎందుకు ఇవ్వడం లేదు?

ప్రభుత్వ ఉద్యోగులకు ధరలు పెరిగితే కరువు భత్యం (DA) లభిస్తుంది, కానీ EPS-95 పెన్షనర్లకు అది వర్తించదు. దీనికి కారణం ఈ పథకం డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ తరహాలో ఉండటమే. అంటే పెన్షన్ ఎంత వస్తుందనేది ద్రవ్యోల్బణంపై కాకుండా, ఫండ్‌లో ఉద్యోగి ఎంత డబ్బు జమ చేశాడనే దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకే, DA అనేది ఈ పథకం నిర్మాణంలో భాగం కాదు కాబట్టి, పెరిగిన ధరల ప్రయోజనం వీరికి ఇవ్వడం లేదని ప్రభుత్వం వివరించింది. ఈ కారణం వల్లనే మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగినా, వీరి ఆదాయం మాత్రం రూ.1,000 వద్దే ఆగిపోతోంది.

పెన్షన్ పెంపునకు ప్రధాన అడ్డంకి

పెన్షన్ పెంచకపోవడానికి ప్రభుత్వం చూపిన అతిపెద్ద కారణం నిధుల కొరత. 2019 నాటి యాక్చురియల్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ పెన్షన్ ఫండ్ నష్టాల్లో నడుస్తోంది. భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వడానికి కావాల్సినంత డబ్బు ఫండ్‌లో లేదని ప్రభుత్వం చెప్పింది. ఈ స్థితిలో ఫండ్‌కు నిధులు పెంచకుండా కనీస పెన్షన్‌ను పెంచితే, మొత్తం వ్యవస్థపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాదించింది. ప్రస్తుతం కేంద్రం బడ్జెట్ నుంచి సహాయం అందిస్తూనే రూ.1,000 కనీస పెన్షన్‌ను చెల్లిస్తోంది.

ముందున్న పరిష్కారం ఏమిటి?

2014లో రూ.1,000 గా నిర్ణయించిన కనీస పెన్షన్, పదేళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెన్షన్ రూ.7,500 వరకు పెరగాలంటే ఫండ్‌కు వచ్చే డబ్బును పెంచాలి. అంటే, ఉద్యోగులను నియమించుకునే యజమానుల (కంపెనీల) వాటాను లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని భారీగా పెంచాలి. ఫండింగ్ విధానంలో ఈ పెద్ద మార్పులు జరిగేంత వరకు, ఈ పెన్షన్ పెంపు కల నెరవేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story