EPF Pension Rule : పీఎఫ్ పెన్షన్ స్కీమ్‌కు 10 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి.. నిబంధనలు పాటించకపోతే మీ డబ్బు ఏమవుతుంది?

EPF Pension Rule : ఉద్యోగుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపీఎఫ్ పథకం గురించి చాలా మందికి అనేక సందేహాలున్నాయి. ముఖ్యంగా,ఈపీఎఫ్‌లో భాగంగా ఉండే ఈపీఎస్ గురించిన నిబంధనలు, అర్హతలు, డబ్బులు ఏమవుతాయనే విషయాలపై క్లారిటీ చాలా మందికి లేదు.
ఈపీఎఫ్, ఈపీఎస్ అంటే ఏమిటి?
ఈపీఎఫ్ఓ అనేది ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి ఆసరాగా నిలిచే ఒక పథకం. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి ఒక ఈపీఎఫ్ ఖాతాతో పాటు ఈపీఎస్ ఖాతా కూడా తెరవబడుతుంది. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఈపీఎస్ ఖాతాలో జమ అయిన డబ్బును వారికి పింఛన్‌గా అందిస్తారు. ఒక ఉద్యోగి బేసిక్ వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా జమ అవుతుంది. అంతే మొత్తంలో కంపెనీ కూడా చెల్లిస్తుంది. అయితే, యజమాని చెల్లించే 12 శాతం మొత్తంలో 8.33 శాతం ఈపీఎస్ ఖాతాకు వెళ్తుంది, మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది.
పింఛన్ పొందాలంటే 10 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి
మీరు ఈపీఎస్ పథకం కింద పింఛన్ పొందాలంటే, మీకు 58 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. కనీసం 10 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు 9 సంవత్సరాల సర్వీస్ చేసి ఉద్యోగం మానేస్తే, మీరు పింఛన్‌కు అర్హులు కారు. 10 సంవత్సరాలు సర్వీస్ చేసి 40 సంవత్సరాల వయస్సులో ఉద్యోగం మానేసినా, వెంటనే పింఛన్ రాదు. పింఛన్ పొందాలంటే 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వేచి ఉండాలి. అయితే, 50 సంవత్సరాలు దాటిన తర్వాత పింఛన్ తీసుకోవచ్చు కానీ, అప్పుడు వచ్చే మొత్తం తక్కువగా ఉంటుంది.
10 ఏళ్ల సర్వీస్ లేకపోతే ఈపీఎస్ డబ్బులు ఏమవుతాయి?
మీరు 10 సంవత్సరాల పాటు ఈపీఎస్ ఖాతాలో యాక్టివ్‌గా లేకపోతే, అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేయకపోతే, మీకు పింఛన్ అర్హత ఉండదు. అయితే, మీ EPS ఖాతాలో జమ అయిన డబ్బు ఎక్కడికీ పోదు. మీరు ఆ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుకు వార్షికంగా వడ్డీ జమ అయినట్లే, EPS ఖాతాలో ఉన్న డబ్బుకు కూడా వడ్డీ జమ అవుతూ ఉంటుంది.
ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బుతో పింఛన్ రాదా?
ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బును పదవీ విరమణ తర్వాత పొందడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. కానీ, మధ్యలో అత్యవసర అవసరాల కోసం కొంత ఈపీఎఫ్ డబ్బును ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ అడ్వాన్స్‌గా డబ్బు తీసుకోకుండా ఉంటే, 58 సంవత్సరాల తర్వాత ఈపీఎఫ్ లోని మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోవచ్చు. ఈపీఎస్ ఖాతాలోని డబ్బు మాత్రమే పింఛన్‌కు ఉపయోగించబడుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

