EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు లాటరీ..రిటైర్మెంట్ తర్వాత లక్షాధికారి అయ్యే ఛాన్స్.

EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు లాటరీ..రిటైర్మెంట్ తర్వాత లక్షాధికారి అయ్యే ఛాన్స్.
X

EPFO : ప్రస్తుతం మనకు వచ్చే పెన్షన్ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఈపీఎఫ్ఓ పెట్టిన రూ.15,000 జీతం పరిమితి. మీ అసలు జీతం రూ.50 వేలు ఉన్నా లేదా రూ.లక్ష ఉన్నా.. పెన్షన్ లెక్కించేటప్పుడు మాత్రం కేవలం రూ.15,000 మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివల్ల మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఈపీఎస్కి వెళ్లే వాటా తక్కువగా ఉండి, చివరకు రిటైర్మెంట్ అయ్యాక వచ్చే పెన్షన్ కూడా చాలా తక్కువగా (గరిష్టంగా రూ.7,500) ఉంటోంది. చాలా మందికి కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే అందుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ పెన్షన్ జీతం పరిమితిని రూ.15,000 నుంచి రూ.30,000కు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఈ లిమిట్ పెరిగితే పెన్షన్ లెక్కించే ఫార్ములా పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా పెన్షన్ లెక్కించే ఫార్ములా ఇలా ఉంటుంది: (పెన్షన్ అర్హత గల జీతం *సర్వీస్ కాలం) / 70. ప్రస్తుతం 15 వేల మీద లెక్కేస్తుంటే వచ్చే రూ.7,500 పెన్షన్, రేపు 30 వేల మీద లెక్కేస్తే ఏకంగా రూ.15,000 అవుతుంది. అంటే మీ పెన్షన్ నేరుగా డబుల్ అవుతుందన్నమాట.

ఈ మార్పు జరిగితే 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు నెలకు రూ.15,000 పెన్షన్ లభించే అవకాశం ఉంది. కేవలం గరిష్ట పెన్షనే కాదు, కనీస పెన్షన్ కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1,000 ఉండగా, కొత్త నిబంధనల ప్రకారం ఇది రూ.4,285 కి చేరే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ ఉద్యోగుల జీవితంలో ఇదొక పెద్ద ఊరట అని చెప్పవచ్చు. దీనివల్ల మీ ఈపీఎస్ వాటా పెరిగినా, రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

పెన్షన్ లెక్కించేటప్పుడు రిటైర్మెంట్ కు ముందున్న చివరి 60 నెలల సగటు జీతాన్ని తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు జీతాల పరిమితి పెరిగితే, ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కు కంపెనీల వాటా కూడా పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఒక గొప్ప భరోసానిస్తుంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే, ప్రైవేట్ రంగంలో రిటైర్మెంట్ జీవితం మరింత ఆనందంగా మారుతుంది.

Tags

Next Story