EPFO : నిరుపయోగ పీఎఫ్ ఖాతాలకు విముక్తి.. 31 లక్షల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు.

EPFO : లక్షలాది మంది ఈపీఎఫ్‌ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి పడి ఉన్న నిరుపయోగ ఖాతాలను క్లియర్ చేసేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా దాదాపు 7.11 లక్షల క్లోజ్డ్ అకౌంట్లలో ఉన్న డబ్బును నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రూ.1,000 అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారుల కోసం ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సభ్యులు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోకుండానే, ఈపీఎఫ్‌ఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే తమ సొమ్మును తిరిగి పొందవచ్చు.
తాజా నివేదికల ప్రకారం.. ఇలాంటి చిన్న చిన్న మొత్తాలు ఉన్న ఖాతాల్లో సుమారు రూ.30.52 కోట్లు ఏళ్ల తరబడి అన్‌క్లెయిమ్‌డ్‌గా పడి ఉన్నాయి. ఈ సొమ్మును ఇప్పుడు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయనున్నారు. ఒకవేళ సదరు ఖాతాదారుడు మరణించి ఉంటే, ఆ మొత్తాన్ని వారి నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు. ఉద్యోగం మారినప్పుడు లేదా రిటైర్ అయిన తర్వాత చాలా మంది పాత ఖాతాల్లో ఉన్న తక్కువ మొత్తాలను వదిలేస్తుంటారు. వరుసగా 36 నెలల పాటు ఎలాంటి నగదు జమ కాని ఖాతాలను ఇన్-ఆపరేటివ్ ఖాతాలుగా ఈపీఎఫ్‌ఓ పరిగణిస్తుంది.
కేవలం చిన్న మొత్తాలనే కాకుండా, మొత్తం మీద క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న సుమారు 31.86 లక్షల ఖాతాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిలో ఏకంగా రూ.10,903 కోట్ల భారీ మొత్తం నిల్వ ఉంది. ప్రస్తుతానికి తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలతో ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలైనా, దశలవారీగా మిగిలిన పెద్ద మొత్తాలను కూడా సెటిల్ చేసేలా కసరత్తు జరుగుతోంది. ప్రజల సొమ్మును వారికి సులభంగా చేరవేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈపీఎఫ్‌ఓ 3.0ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీని కింద కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సేవలను పూర్తి డిజిటల్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుండగా, కొత్త విధానం అమల్లోకి వస్తే కేవలం 3 రోజుల్లోనే పని పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. తక్కువ కాగితపు పని, ఎక్కువ పారదర్శకతతో ఈపీఎఫ్‌ఓ సేవలు సరికొత్త రూపును సంతరించుకోబోతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
