EPFO Rules 2026 : ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్..పెన్షన్ రావాలంటే ఈ రెండు కండిషన్లు ఉండాల్సిందే.

EPFO Rules 2026 : ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ కట్ అవుతూనే ఉంటుంది. శాలరీ స్లిప్ చూడగానే పీఎఫ్ ఎంత కట్ అయిందో మనకు అర్థమవుతుంది కానీ, అందులో పెన్షన్ లెక్కలు మాత్రం చాలా మందికి ఒక పట్టాన అర్థం కావు. పీఎఫ్ పాస్‌బుక్ తెరిస్తే వడ్డీతో కలిపి అసలు ఎంత ఉందో క్లియర్ గా కనిపిస్తుంది కానీ, పెన్షన్ కాలమ్ దగ్గరకు వచ్చేసరికి ఏదో కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. అసలు ఈ పెన్షన్ డబ్బులు మనకు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏంటి? అనే విషయాలను ప్రతి ఉద్యోగి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పెన్షన్ పొందడానికి ఉన్న రెండు ప్రధాన షరతులు

ప్రైవేట్ ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ లభించాలంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు కఠినమైన నిబంధనలను పెట్టింది. ఈ రెండూ పూర్తయితేనే మీకు జీవితాంతం పెన్షన్ వస్తుంది.

10 ఏళ్ల సర్వీస్: మీరు కనీసం 10 సంవత్సరాల పాటు పింఛను యోగ్యమైన సేవ పూర్తి చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకుంటే, ఆ పాత సర్వీస్ పెన్షన్ లెక్కలోకి రాదు. అందుకే ఉద్యోగం మారినప్పుడల్లా పీఎఫ్ ను కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అప్పుడే సర్వీస్ కంటిన్యూ అవుతుంది.

వయస్సు నిబంధన: పూర్తిస్థాయి పెన్షన్ పొందాలంటే ఉద్యోగికి 58 ఏళ్లు నిండాలి. 10 ఏళ్ల సర్వీస్, 58 ఏళ్ల వయస్సు.. ఈ రెండూ కలిస్తేనే మీరు లైఫ్‌టైమ్ పెన్షన్ కు అర్హులు.

జీతం నుంచి పెన్షన్ ఫండ్‌కు డబ్బులు ఎలా వెళ్తాయి?

మీ జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ అంతా ఒకే ఖాతాలోకి వెళ్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అసలు లెక్క వేరు. మీ బేసిక్ జీతం నుంచి 12 శాతం మీ వాటాగా కట్ అవుతుంది. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే, యాజమాన్యం ఇచ్చే 12 శాతంలో 8.33 శాతం డబ్బులు నేరుగా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఖాతాలోకి వెళ్తాయి. మిగిలిన 3.67 శాతం మాత్రమే పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేతన పరిమితి (ప్రస్తుతం రూ.15,000) ఆధారంగానే ఈ 8.33 శాతం లెక్కగడతారు. అందుకే లక్షల్లో జీతం ఉన్నా, పెన్షన్ ఒక పరిమితి దాటి రాదు.

50 ఏళ్లకే పెన్షన్ తీసుకోవడం లాభమా? నష్టమా?

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, మీరు 50 ఏళ్లు నిండిన తర్వాత కూడా పెన్షన్ తీసుకోవచ్చు. కానీ దీన్ని అర్లీ పెన్షన్ అంటారు. 58 ఏళ్లు నిండకముందే పెన్షన్ తీసుకోవాలని చూస్తే, ప్రతి ఏడాదికి 4 శాతం చొప్పున పెన్షన్ మొత్తంలో కోత విధిస్తారు. ఉదాహరణకు.. మీరు 50 ఏళ్లకే పెన్షన్ మొదలుపెడితే, మీకు రావాల్సిన దానికంటే 32 శాతం తక్కువ డబ్బులే జీవితాంతం అందుతాయి. అదే మీరు 58 దాటాక కూడా ఆగితే, అంటే 60 ఏళ్ల వరకు పెన్షన్ తీసుకోకుండా ఉంటే, మీకు వచ్చే పెన్షన్ మొత్తం కొంత పెరుగుతుంది.

10 ఏళ్ల కంటే ముందే ఉద్యోగం మానేస్తే?

చాలా మంది ఉద్యోగుల మనసులో ఉండే భయం ఏంటంటే.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకముందే ఉద్యోగం మానేస్తే ఆ డబ్బులు పోతాయా అని. అస్సలు పోవు. మీ సర్వీస్ 10 ఏళ్ల కంటే తక్కువ ఉంటే, మీరు మంత్లీ పెన్షన్ కు అర్హులు కాదు కానీ, ఆ డబ్బును ఒక్కసారిగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేక సర్వీస్ టేబుల్‌ను ఉపయోగిస్తుంది. మీరు ఎన్ని ఏళ్లు ఉద్యోగం చేశారు, మీ చివరి జీతం ఎంత అనే విషయాలను బట్టి ఒక నిర్ణీత మొత్తాన్ని మీకు ఇచ్చేస్తారు.

Tags

Next Story