EPFO : ట్రాన్స్‌జెండర్లకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్..ఇక చిటికెలో పీఎఫ్ రికార్డుల్లో మార్పులు.

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ట్రాన్స్‌జెండర్ల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గానికి అండగా నిలుస్తూ, ఈపీఎఫ్ రికార్డుల్లో పేరు, లింగాన్ని మార్చుకునే ప్రక్రియను అత్యంత సులభతరం చేసింది. దీనివల్ల ఇకపై ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పీఎఫ్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ జారీ చేసే సర్టిఫికేట్‌ను ఇప్పుడు ఈపీఎఫ్‌ఓ అధికారిక గుర్తింపు పత్రంగా ఆమోదిస్తోంది.
కొత్త సర్క్యులర్ ఏం చెబుతోంది?
ఈపీఎఫ్‌ఓ తాజాగా విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. ట్రాన్స్‌జెండర్లు తమ పేరు లేదా లింగాన్ని ఈపీఎఫ్ రికార్డుల్లో మార్చుకోవాలనుకుంటే, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించే [https://transgender.dosje.gov.in/] పోర్టల్ ద్వారా పొందిన గుర్తింపు కార్డు లేదా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. దీనిని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్‌గా పరిగణించాలని ఈపీఎఫ్‌ఓ తన ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. జనవరి 16, 2025న విడుదల చేసిన జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియలోని అనెక్సర్-IIలో ఈ కొత్త డాక్యుమెంట్‌ను కూడా చేర్చారు.
అవసరమైన ఇతర పత్రాలు
ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డుతో పాటు, కింది వాటిలో ఏవైనా కొన్ని పత్రాలను జత చేయడం ద్వారా రికార్డులను మార్చుకోవచ్చు:
* నేషనల్ పోర్టల్ జారీ చేసిన ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డు.
* పాస్‌పోర్ట్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ.
* డ్రైవింగ్ లైసెన్స్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటోతో కూడినది).
* జనన ధృవీకరణ పత్రం లేదా స్కూల్ టీసీ/మార్క్స్ మెమో.
* కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులు.
* రేషన్ కార్డు లేదా పెన్షనర్ కార్డు.
ఉద్యోగుల వర్గీకరణ - అప్‌డేట్ ప్రక్రియ:
ప్రొఫైల్ అప్‌డేట్‌లను సులభతరం చేయడానికి ఈపీఎఫ్‌ఓ సభ్యులను మూడు కేటగిరీలుగా విభజించింది. అక్టోబర్ 1, 2017 తర్వాత యుఏఎన్ జనరేట్ అయి, ఆధార్‌తో లింక్ అయిన వారు సులభంగా ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవచ్చు. 2017 కంటే ముందు యుఏఎన్ ఉన్నప్పటికీ, పేరు, పుట్టిన తేదీ మరియు ఆధార్ వివరాలు ఇప్పటికే వెరిఫై అయిన వారు. ఆధార్ వెరిఫై కాని వారు లేదా యుఏఎన్ లేని వారు,మరణించిన సభ్యుల వారసులు ఈ వర్గంలోకి వస్తారు.
ఈ మార్పుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లను డిజిలాకర్ ద్వారా నేరుగా సమర్పించే వెసులుబాటును కూడా ఈపీఎఫ్‌ఓ కల్పించింది. ఒకవేళ ఆన్‌లైన్ సాధ్యం కాకపోతే, అన్ని పత్రాలను కలిపి ఒకే ఒక పిడిఎఫ్ ఫైల్‌గా అప్‌లోడ్ చేసి జాయింట్ డిక్లరేషన్ ద్వారా అప్రూవల్ పొందవచ్చు. లింగమార్పిడి వ్యక్తులు తమ పాత రికార్డుల్లో ఉన్న పేరును ప్రస్తుత గుర్తింపు కార్డుతో సరిపోల్చుకోవడం ద్వారా పీఎఫ్ విత్ డ్రా సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.
ఈపీఎఫ్‌ఓ తీసుకున్న ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్ల సామాజిక భద్రతకు పెద్ద ఊతం ఇస్తుంది. చాలా మంది ట్రాన్స్‌జెండర్లు ఉద్యోగాల్లో చేరినప్పుడు ఉన్న పేరును, లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత మార్చుకుంటారు. అటువంటి సమయంలో పీఎఫ్ డబ్బులు రాక చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కేంద్రం జారీ చేసిన కార్డునే నేరుగా ఆమోదించడం వల్ల వేల మందికి ప్రయోజనం కలుగుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

