Ghost Employee Fraud : సొంత కంపెనీకే 11 కోట్ల కన్నం వేసిన ఇండియన్ బాస్..అమెరికాలో బట్టబయలైన బాగోతం.

Ghost Employee Fraud : సొంత కంపెనీకే 11 కోట్ల కన్నం వేసిన ఇండియన్ బాస్..అమెరికాలో బట్టబయలైన బాగోతం.
X

Ghost Employee Fraud : ఆఫీసుకి వెళ్లక్కర్లేదు.. పని చేయాల్సిన అవసరం అస్సలే లేదు.. కానీ ఏటా అకౌంట్‌లో రూ.90 లక్షల జీతం పడిపోతుంది. వినడానికి ఏదో సినిమా కథలా ఉన్నా, అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీలో ఒక భారతీయుడు చేసిన ఘరానా మోసం ఇది. తన పదవిని అడ్డం పెట్టుకుని, కంపెనీ కళ్లు గప్పి ఏకంగా 11 కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడిన ఈ దేశీ బాస్ బాగోతం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. మిన్నియాపాలిస్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారంలో నిందితుడు చివరకు ఫెడరల్ కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది.

ఏమిటా స్కామ్? ఎలా మొదలైంది?

యూఎస్ అటార్నీ ఆఫీసు వెల్లడించిన వివరాల ప్రకారం.. 47 ఏళ్ల కరణ్ గుప్తా అనే వ్యక్తి అమెరికాలోని ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ యునైటెడ్ హెల్త్‎కు చెందిన ఆప్టమ్ సంస్థలో డేటా అనలిటిక్స్ విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. కరణ్ వార్షిక జీతం రూ.2.3 కోట్లు. ఇంత పెద్ద జీతం వస్తున్నా అతడికి ఆశ చావలేదు. 2015లో తన చిన్ననాటి స్నేహితుడికి ఒక భారీ నో-షో జాబ్ (పని చేయాల్సిన అవసరం లేని ఉద్యోగం) కల్పించాడు. ఆ స్నేహితుడికి ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు అస్సలు లేకపోయినా, ఒక ఫేక్ రెజ్యూమే సృష్టించి మరీ మేనేజర్ హోదాలో ఉద్యోగం ఇప్పించాడు.

ఘోస్ట్ ఎంప్లాయీ.. సగం జీతం కమీషన్

ఈ మొత్తం కుట్రలో అసలు మెలిక ఇక్కడే ఉంది. తన స్నేహితుడికి ఊరికే ఉద్యోగం ఇప్పించలేదు కరణ్ గుప్తా. వచ్చే జీతంలో సగం వాటా తనకే ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే దాదాపు ఏడాదికి రూ.45 లక్షలు కరణ్ జేబులోకి వెళ్లేవి. సుమారు నాలుగేళ్ల పాటు ఆ స్నేహితుడు ఒక్క పని కూడా చేయలేదు, కనీసం సిస్టమ్‌లో లాగిన్ కూడా కాలేదు. కానీ కరణ్ అతడికి రిపోర్టింగ్ బాస్ కావడంతో ఎవరూ అనుమానించలేదు. జీతంతో పాటు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు కూడా రెగ్యులర్‌గా అందేలా కరణ్ జాగ్రత్త పడ్డాడు.

డబ్బుల మార్పిడికి మాస్టర్ ప్లాన్

ఈ అక్రమ సొమ్మును తీసుకోవడానికి వీరు చాలా తెలివైన మార్గాలను ఎంచుకున్నారు. మొదట్లో ఆ స్నేహితుడు న్యూజెర్సీలో నగదు డ్రా చేసి కరణ్ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసేవాడు. దీనివల్ల కాలిఫోర్నియాలో ఉన్న కరణ్ సులభంగా డబ్బు తీసుకునేవాడు. ఆ తర్వాత కాలంలో ఏకంగా ఆ స్నేహితుడి పేరిట కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ డెబిట్ కార్డును కరణ్ తన దగ్గరే ఉంచుకున్నాడు. నేరుగా ఏటీఎం నుంచి తన కమీషన్ సొమ్మును డ్రా చేసేవాడు. ఇలా సుమారు 1.2 మిలియన్ డాలర్లు (రూ.11 కోట్లు) కంపెనీకి నష్టం వాటిల్లింది.

బయటపడిందిలా.. కోర్టు తీర్పు ఇదే

అయితే, పాపం పండినట్టు 2019లో వేరే కారణంతో కరణ్ గుప్తాను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన అంతర్గత విచారణలో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఎఫ్బీఐ రంగంలోకి దిగి విచారించగా, కరణ్ అక్రమాలు అన్నీ బట్టబయలయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత, ఫెడరల్ కోర్టు కరణ్‌ను మనీ లాండరింగ్, మోసం కేసుల్లో దోషిగా తేల్చింది. నమ్మిన సంస్థకే కన్నం వేసి, వ్యవస్థను తప్పుదోవ పట్టించిన ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Next Story