Jobs : ఏఐ తెలిస్తే చాలు.. లక్షల్లో జీతం, వేలల్లో ఉద్యోగాలు.. నౌకరీ నివేదికలో ఆసక్తికర నిజాలు.

Jobs : ఏఐ తెలిస్తే చాలు.. లక్షల్లో జీతం, వేలల్లో ఉద్యోగాలు.. నౌకరీ నివేదికలో ఆసక్తికర నిజాలు.
X

Jobs : భారతదేశ ఉద్యోగ మార్కెట్‌లో ఎట్టకేలకు మంచికాలం మొదలైంది. గత కొన్ని ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న వైట్-కాలర్ జాబ్ మార్కెట్, ఈ ఏడాది ఫిబ్రవరిలో కళ్లు చెదిరే ఫలితాలను నమోదు చేసింది. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ విడుదల చేసిన జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం.. గతేడాది ఫిబ్రవరిలో 2,890 పాయింట్లుగా ఉన్న ఇండెక్స్, ఈసారి 12 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 3,233 పాయింట్లకు చేరుకుంది. ప్రధానంగా ఐటీ రంగం మళ్లీ పుంజుకోవడం, కృత్రిమ మేధస్సు (AI) విభాగంలో నియామకాలు వెల్లువెత్తడం ఈ భారీ మార్పుకు కారణమయ్యాయి.

సాధారణంగా జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో నియామకాలు 13 నుంచి 16 శాతం పెరగడం సహజం. కానీ ఈసారి ఏకంగా 23 శాతం నెలవారీ వృద్ధి నమోదు కావడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ ఈ ధోరణిని విశ్లేషిస్తూ.. ఐటీ కంపెనీలు, ముఖ్యంగా భారతీయ మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పుడు ఏఐ టాలెంట్‌ను పెంచుకోవడంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో మార్కెట్ ఇంత బలంగా ఉండటం నిరుద్యోగులకు, కెరీర్ మార్పు కోరుకునే వారికి గొప్ప శుభసూచకం.

ఐటీ రంగంలో నియామకాలు గతేడాదితో పోలిస్తే 6 శాతం పెరిగాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భారీ జీతాలు ఇచ్చే సీనియర్ పదవులకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏడాదికి రూ.20 లక్షల కంటే ఎక్కువ జీతం ఉండే ఉద్యోగాల నియామకాలు 19 శాతం పెరగ్గా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీ ఉన్న కీలక పదవుల నియామకాలు ఏకంగా 45 శాతం పెరిగాయి. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో ఉద్యోగాలు 40 శాతం పెరిగాయి. మొత్తం జాబ్ మార్కెట్‌లో చూస్తే ఈ ఏఐ/ఎంఎల్ రోల్స్ వృద్ధి 49 శాతంగా ఉండటం విశేషం. ముఖ్యంగా భారతీయ ఎంఎన్సీలు ఏఐ నియామకాల్లో 82 శాతం వృద్ధిని నమోదు చేసి విదేశీ కంపెనీలను వెనక్కి నెట్టేశాయి.

కేవలం ఐటీ మాత్రమే కాదు, ఇతర రంగాల్లోనూ ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇన్సూరెన్స్ రంగం 28 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత బీపీఓ (22%), రియల్ ఎస్టేట్ (19%), ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ (15%), రిటైల్ (14%) రంగాలు నియామకాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో నియామకాలు పెరగడానికి దేశీయ కంపెనీలతో పాటు విదేశీ ఎంఎన్సీలు కూడా కారణమయ్యాయి. 13 నుంచి 16 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ల కోసం కంపెనీలు ఎగబడుతున్నాయి. నగరాల వారీగా చూస్తే.. పుణె (24%), ముంబై (20%), బెంగళూరు (19%) నగరాలు ఉద్యోగ కల్పనలో టాప్ గేర్‌లో ఉన్నాయి. మొత్తానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు అందరికీ ఈ ఫిబ్రవరి నెల ఒక అద్భుతమైన అవకాశాల గనిగా మారింది.

Tags

Next Story