PF Withdrawal : పీఎఫ్ డబ్బుల కోసం ఇక తిప్పలు తప్పినట్టే.. భీమ్ యాప్‌లో ఒక్క క్లిక్ కొడితే చాలు.

PF Withdrawal : పీఎఫ్ డబ్బుల కోసం ఇక తిప్పలు తప్పినట్టే.. భీమ్ యాప్‌లో ఒక్క క్లిక్ కొడితే చాలు.
X

PF Withdrawal : పీఎఫ్ ఖాతాదారుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో భీమ్ యాప్ ద్వారా తక్షణమే పీఎఫ్ అడ్వాన్స్ డబ్బులను పొందే వెసులుబాటును ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల 30 కోట్లకు పైగా ఉన్న చందాదారులకు అత్యవసర సమయాల్లో చేతికి నగదు సులభంగా అందుతుంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ క్లెయిమ్ చేస్తే డబ్బులు ఖాతాలో పడటానికి కనీసం మూడు నుంచి వారం రోజులు పడుతోంది. కానీ కొత్త విధానంలో, మీరు భీమ్ యాప్ ద్వారా క్లెయిమ్ చేసిన వెంటనే.. ఈపీఎఫ్ఓ బ్యాకెండ్‌లో మీ వివరాలను ధృవీకరిస్తుంది. ఆ వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మీ యూపీఐకి లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ అవుతుంది. ఇది దాదాపు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినంత వేగంగా జరుగుతుంది. మొదట ఈ ఫీచర్ భీమ్ యాప్‌లో మాత్రమే ఉన్నా, భవిష్యత్తులో ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్‌లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలు పెట్టింది. మొదటగా కేవలం మెడికల్, పిల్లల చదువు, పెళ్లిళ్లు లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తక్షణమే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఉండే లిమిట్ దీనికి కూడా వర్తిస్తుంది. అంటే పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోలేము, కొంత పరిమితి వరకు మాత్రమే తక్షణమే తీసుకోవచ్చు. పూర్తి పీఎఫ్ డబ్బుల కోసం పాత పద్ధతిలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. మీరు నిరుద్యోగిగా ఉంటే నెల రోజుల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పూర్తి డబ్బులు తీసుకోవచ్చు. అదే వైద్య అవసరాలకైతే ఎప్పుడైనా తీసుకోవచ్చు. పిల్లల చదువు కోసం లేదా పెళ్లిళ్ల కోసం 7 ఏళ్ల సర్వీసు నిండితే పీఎఫ్ లో కొంత భాగం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవడానికి, లోన్ కట్టడానికి కూడా వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా యూపీఐ ద్వారా మారడం వల్ల సామాన్యులకు, ముఖ్యంగా ఆఫీసుల చుట్టూ తిరగలేని వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

Tags

Next Story