IT Alert: ఐటీ రిటర్నులలో తప్పులు ఉన్నాయా? తప్పుడు డిడక్షన్లు చూపిస్తే ఐటీ శాఖ వదిలిపెట్టదు.

IT Alert: ఐటీ రిటర్నులలో తప్పులు ఉన్నాయా? తప్పుడు డిడక్షన్లు చూపిస్తే ఐటీ శాఖ వదిలిపెట్టదు.
X

IT Alert: మీరు ఏడాదికి రూ.50 లక్షలకు పైగా సంపాదిస్తున్నారా? అయితే ఆదాయపు పన్ను శాఖ మీపై గట్టిగా కన్నేసింది. పన్ను మినహాయింపులు, డిడక్షన్ల పేరుతో తప్పుడు క్లెయిమ్‌లు చేసే వారిని ఏరివేసేందుకు ఐటీ శాఖ భారీ స్థాయిలో నోటీసులు జారీ చేస్తోంది. కేవలం నోటీసులతోనే ఆగిపోకుండా, తప్పుడు సమాచారం ఇస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తోంది. ఇటీవలే ఒక టాక్స్ కన్సల్టెంట్ వేదికగా బయటపడిన ఒక ఉదాహరణ చూస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. ఒక పన్ను చెల్లింపుదారుడు రూ.10.65 లక్షల తప్పుడు డిడక్షన్ క్లెయిమ్ చేయగా, దానికి అదనపు పన్నుతో పాటు ఏకంగా 200 శాతం జరిమానా విధించారు. దీంతో అతను రూ.9.44 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.

ఒకప్పుడు ఐటీ రిటర్నులలో చిన్న చిన్న తప్పులు చేసినా బయటపడేవి కావు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆదాయపు పన్ను శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను వాడుతోంది. మీ ఐటీఆర్ డాక్యుమెంట్లను మీ ఫామ్-16, కంపెనీ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలతో ఈ సాఫ్ట్‌వేర్ క్షణాల్లో సరిపోల్చి చూస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా సిస్టమ్ వెంటనే రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సంపాదన ఉన్న వారిపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది, ఎందుకంటే వీరి ద్వారా ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది.

పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలి?

మీరు ఒకవేళ భారీగా డిడక్షన్లు క్లెయిమ్ చేసి ఉంటే, వెంటనే మీ రిటర్నులను మరోసారి చెక్ చేసుకోవడం మంచిది. మీ దగ్గర ఉన్న హెచ్‌ఆర్ఏ రసీదులు, ఎల్‌టీఏ, 80C, 80D పెట్టుబడి ఆధారాలను సిద్ధంగా ఉంచుకోండి. తప్పుడు పత్రాలతో మినహాయింపులు పొందితే భవిష్యత్తులో ఐటీ నోటీసులు రావడం ఖాయం. ఒకవేళ మీరు ఇప్పటికే తప్పు చేసినట్లు గుర్తిస్తే, దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. నోటీసు వచ్చే వరకు వేచి చూడకుండా సొంతంగా సరిచేసుకోవడమే ఉత్తమం.

రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసే గడువు ముగిసిపోయి ఉంటే, మీకు ITR-U అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన 48 నెలల లోపు ఎప్పుడైనా మీ తప్పులను సరిదిద్దుకుని ఐటీఆర్-యు ఫైల్ చేయవచ్చు. అయితే దీనికి అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంత ఆలస్యం చేస్తే పెనాల్టీ భారం అంత పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఐటీఆర్-యు ద్వారా మీరు పన్ను తగ్గించుకోవడానికో లేదా ఎక్కువ రీఫండ్ తీసుకోవడానికో అవకాశం ఉండదు. కేవలం ఆదాయాన్ని సరిగ్గా చూపడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

Tags

Next Story