TDS : శాలరీలో టీడీఎస్ కట్ అయితే.. మళ్లీ ట్యాక్స్ అడగదు ప్రభుత్వం..ఉద్యోగులకు భారీ ఊరట.

TDS : మీ నెలవారీ జీతం నుంచి ప్రతి నెలా ట్యాక్స్ కట్ అవుతున్నా, ఏడాది చివరిలో మీరు కట్టాల్సిన పన్ను జమ కాలేదు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసు పంపిస్తే ఎంత ఇబ్బంది పడతారు? కోల్‌కతాలో ఒక ఎడ్-టెక్ కంపెనీ ఉద్యోగికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కంపెనీ అతని జీతం నుండి దాదాపు రూ.14.88 లక్షల టీడీఎస్ కట్ చేసింది. కానీ ఆ కంపెనీ ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. దీంతో ఉద్యోగి ఐటీఆర్ ఫైల్ చేసి ఆ కట్ అయిన ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ విభాగం దాన్ని తిరస్కరించి, పన్ను కట్టాలంటూ డిమాండ్ నోటీసు పంపింది. ఎందుకంటే తమ ఖజానాలో ఆ డబ్బు జమ కాలేదని విభాగం వాదించింది.
ఉద్యోగి ఈ వివాదంపై వెనక్కి తగ్గకుండా, విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT), కోల్‌కతా వరకు తీసుకెళ్లారు. ఉద్యోగి తరఫు న్యాయవాదులు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 205 ను ప్రస్తావించారు. ఈ సెక్షన్ ప్రకారం ఒకరి జీతం నుంచి ట్యాక్స్ కట్ అయిన తర్వాత, అదే ట్యాక్స్ ను మళ్లీ చెల్లించమని అతన్ని అడగకూడదు. ఈ వాదనను బలంగా వినిపించిన ట్రిబ్యునల్, దిగువ అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పన్ను కట్టడంలో విఫలమైన కంపెనీ నుంచి ట్యాక్స్, జరిమానాను వసూలు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ వైఫల్యం భారాన్ని, జీతం నుంచి ఇప్పటికే డబ్బు కట్ చేయబడిన ఆ ఉద్యోగిపై మోపకూడదు అని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
చివరికి ఐటీఏటీ కోల్‌కతా ట్రిబ్యునల్, దిగువ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉద్యోగికి టీడీఎస్ క్రెడిట్‌ను పూర్తి స్థాయిలో ఇవ్వాలని, పంపిన డిమాండ్ నోటీసును వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. జీతం నుంచి టీడీఎస్ కట్ అయిన వెంటనే, చట్ట ప్రకారం, ఉద్యోగి తన పన్నును చెల్లించినట్లేనని ట్రిబ్యునల్ ధృవీకరించింది. ఇక ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరిందా లేదా అనేది ప్రభుత్వం, కంపెనీ మధ్య ఉన్న అంతర్గత సమస్య అని తేల్చి చెప్పింది. ఈ కీలకమైన తీర్పు దేశంలోని వేతన జీవులందరికీ పెద్ద ఉపశమనం ఇచ్చింది. కంపెనీ చేసిన పొరపాటుకు ఉద్యోగి శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని స్పష్టమైన భరోసా ఇచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

