ITR Refund Delay : ఐటీఆర్ రీఫండ్‌ ఇంకా రాలేదా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.

ITR Refund Delay : ఐటీఆర్ రీఫండ్‌ ఇంకా రాలేదా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.
X

ITR Refund Delay : 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేశారు. కొంతమందికి రీఫండ్‌లు అందినప్పటికీ చాలా మందికి ఈసారి డబ్బులు రావడానికి గతంలో కంటే ఎక్కువ సమయం పడుతోంది. దీనికి ప్రధాన కారణం ఫేక్ రీఫండ్‌లు లేదా పన్ను ఎగవేత ప్రయత్నాలను అరికట్టడానికి ఆదాయపు పన్ను శాఖ ఈసారి ప్రతి క్లెయిమ్‌ను మరింత జాగ్రత్తగా, లోతుగా పరిశీలిస్తోంది. పన్ను చెల్లింపుదారులు అనవసరమైన తగ్గింపులు క్లెయిమ్ చేయడం లేదా ఆదాయాన్ని దాచిపెట్టడం వంటి ట్రిక్స్‌ను నివారించేందుకే ఈ ఆలస్యం జరుగుతోంది. అయినప్పటికీ, CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2025 సంవత్సరం లోపు అర్హత ఉన్న అన్ని రీఫండ్‌లను తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.

రీఫండ్‌ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?

మీరు ఐటీఆర్ దాఖలు చేసినా, రీఫండ్ ఇంకా అందకపోయినా, మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది, ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా. మీరు అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి, మీ పాన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక, మీరు చెక్ చేయాలనుకుంటున్న అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకుని, రీఫండ్ స్టేటస్ విభాగంలో చూడవచ్చు. ఇక్కడ మీ రీఫండ్ విడుదల అయిందా, ప్రాసెస్ అవుతుందా లేదా ఇంకా పరిశీలన దశలో ఉందా అనే వివరాలు తెలుసుకోవచ్చు. దీనితో పాటు, NSDL, TIN వెబ్‌సైట్ ద్వారా కూడా మీ రీఫండ్ స్టేటస్ ని తెలుసుకునే అవకాశం ఉంది.

డబ్బుల కోసం తప్పకుండా చెక్ చేయవలసిన విషయం

మీ రీఫండ్ ప్రక్రియ పూర్తయితే, ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. డబ్బులు క్రెడిట్ అయ్యే ముందు మీరు తప్పకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని నిర్ధారించుకోవాలి.. మీ బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా ఉన్నా, లేదా అది ఐటీ శాఖ పోర్టల్‌లో ప్రీ-వాలిడేట్ కాకపోయినా, రీఫండ్ డబ్బులు మీ ఖాతాలో జమ కాకుండా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రీఫండ్ కోసం వేచి చూసేవారు వెంటనే తమ బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేషన్ స్టేటస్‌ను పోర్టల్‌లో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

Tags

Next Story