Unemployment Rate : నిరుద్యోగం ఖతం.. పెరిగిన కొలువులు.. ఇండియాలో మోగుతున్న శుభసూచిక.

Unemployment Rate : దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSO) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఒక సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారి గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి.
పట్టణాలు, పల్లెల్లో పరిస్థితి ఏంటి?
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు జూలై-సెప్టెంబర్ మధ్య 6.9 శాతంగా ఉండగా, అది అక్టోబర్-డిసెంబర్ నాటికి 6.7 శాతానికి పడిపోయింది. ఇక గ్రామాల్లో పరిస్థితి ఇంకా బాగుంది. అక్కడ నిరుద్యోగిత 4.4 శాతం నుండి 4 శాతానికి తగ్గింది. గ్రామాల్లో పురుషులు, మహిళలు ఇద్దరికీ ఉపాధి లభించడమే ఇందుకు ప్రధాన కారణం. స్వయం ఉపాధి రంగంలో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామాల్లో దాదాపు 63.2 శాతం మంది తమంతట తామే పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
పెరిగిన ఉద్యోగుల సంఖ్య.. దూసుకుపోతున్న మహిళలు
ప్రభుత్వ లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉద్యోగం చేసే వారి సంఖ్య 56.2 కోట్ల నుంచి 57.4 కోట్లకు చేరింది. ఇందులో పురుషుల సంఖ్య 40.2 కోట్లు కాగా, మహిళల సంఖ్య 17.2 కోట్లుగా ఉంది. విశేషం ఏమిటంటే, పని చేసే మహిళల శాతం 33.7 నుంచి 34.9 శాతానికి పెరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున పనుల్లో చేరుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇది మహిళా సాధికారతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏ రంగంలో ఎక్కువ పనులు దొరుకుతున్నాయి?
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయ రంగమే ప్రధాన ఉపాధి వనరుగా ఉంది. దాదాపు 58.5 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారు. పట్టణాల్లో మాత్రం సేవా రంగం ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ 61.9 శాతం మంది సేవా రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. 2025 జనవరి నుండి సర్వే పద్ధతుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి పల్లెలు, పట్టణాల పూర్తి డేటాను అందిస్తోంది. వరుసగా రెండు త్రైమాసికాలుగా ఉపాధి రేటు మెరుగుపడటం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్‌ను ఇస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
