KCR: బెంగాల్‌ రాజకీయాలను గుర్తు చేస్తున్న కేసీఆర్‌ వ్యూహాలు..

KCR: బెంగాల్‌ రాజకీయాలను గుర్తు చేస్తున్న కేసీఆర్‌ వ్యూహాలు..
KCR: కేంద్రంలో బీజేపీని గద్దె దించేవరకు విశ్రమించేది లేదని సీఎం కేసీఆర్‌ శపథం చేశారు.

KCR: కేంద్రంలో బీజేపీని గద్దె దించేవరకు విశ్రమించేది లేదని సీఎం కేసీఆర్‌ శపథం చేశారు. ఆ శపథానికి తగ్గట్లుగానే ముందుకు వెళ్తున్నారు.. ఒక రకంగా బీజేపీ విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే కచ్చితంగా బెంగాల్ రాజకీయాలే గుర్తొస్తున్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బీజేపీని, మోదీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేశారు.. ఆ రాష్ట్ర గవర్నర్ తో విభేదాలు తారా స్థాయికి చేరడంతో పరిపాలనా పరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్ర పరిధిలో నడుస్తున్న యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి మమతనే బెనర్జీనే ఛాన్సులర్‌గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సాధారణంగా రాష్ట్ర గవర్నర్‌ మాత్రమే వర్సిటీలకు ఛాన్సులర్‌గా ఉంటారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధంకార్‌ స్థానంలో ఇక నుంచి మమతా బెనర్జీయే ఛాన్సలర్‌గా ఉండనున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో విజిటర్‌ హోదాలో ఉండే గవర్నర్‌ను కూడా తొలగిస్తూ ఆ అవకాశాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలకు కూడా మమతనే ఛాన్సులర్‌గా ఉంటారని కేబినెట్‌ తీర్మానించింది.

అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రతిపాదనను బిల్లుగా ప్రవేశపెట్టే అమలు చేసుకునేందుకు మమత సిద్ధమయ్యారు. అయితే తెలంగాణలో కూడా రాజ్ భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య అంతరం పెరిగిన నేపథ్యంలో బెంగాల్ తరహాలో నిర్ణయాన్ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. విశ్వవిద్యాలయాలకు ఛాన్సులర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను తప్పించి ఆ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ తమిళిసైతో విభేదాలు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

వెస్ట్ బెంగాల్‌ తరహాలో తెలంగాణలో కూడా అమలు చేసేందుకు త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు కానున్నట్లు సమాచారం. విశ్వవిద్యాలయ ఛాన్సులర్‌గా ముఖ్యమంత్రి నియమిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపనునట్లు సమాచారం. అయితే గతంలో ముఖ్యమంత్రికి, గవర్నర్లకు మధ్య విభేదాల నేపథ్యంలో ఇలాంటి విధానంతో ముందుకు వెళ్లినట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ రాంలాల్‌తో విభేదించి.. ఆయనను ఛాన్సులర్‌ పదవి నుంచి తప్పించారు.

ఇలా దేశంలో మరి కొన్ని రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ విషయంలో తీసుకునే కీలక నిర్ణయం కాబట్టి రాబోయే రోజుల్లో న్యాయపరమైన సమస్యలు రాకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని యూజీసీ, ఇతర విద్యా శాఖకు చెందిన సంస్థల ముఖ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనునట్టు సమాచారం. న్యాయపరంగా క్లారిటీ వచ్చాక ఛాన్సులర్‌గా గవర్నర్‌ను తప్పించి అందుకు ముసాయిదా బిల్లును తయారు చేసి కేబినెట్ ముందుకు తీసుకురావాలని.. ఆ తర్వాత శాసన మండలిలో, అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం ఆలోచన.

ఇప్పటికే టెక్నికల్ అంశాలను చూపించి ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ లేకుండానే అసెంబ్లీ నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు విశ్వవిద్యాలయాల ఛాన్సులర్‌ పదవి నుంచి కూడా తొలగించేందుకు సిద్ధమయింది. మొత్తంగా చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌ తరహాలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ అటు కేంద్రంపై, ఇటు గవర్నర్‌పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌.. ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న చర్చ సర్వత్రా నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story