Linkedin : 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాలుండవు.. లింక్డిన్ కో ఫౌండర్ సంచలనం

Linkedin : 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాలుండవు.. లింక్డిన్ కో ఫౌండర్ సంచలనం
X

కృత్రిమ మేధ అందుబాటులోకి రావటంతో భవిష్యత్తులో ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి కొత్త ధోరణులు రానున్నాయోననే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రముఖ సామాజిక మీడియా లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏతరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే తెరతీశారు హాఫ్మన్. ప్రస్తుతం ఉన్న 9-5టైం ఉద్యోగాలు అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర, ఒకే విధిని నిర్వర్తించబోరని తెలిపారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే రోజులు రానున్నాయని చెప్పారు.

2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగ వుతాయని హాఫ్మన్ తెలిపారు. దీనివల్ల అవకాశాలతో పాటు, సవాళ్లూ ఉంటాయని వివరించారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. అదే సమయంలో ఒకే వ్యక్తి వివిధ కంపెనీలకే కాకుండా తన నైపుణ్యాలు, ప్రతిభకు అనుగుణంగా పలు రంగాల్లో రకరకాల విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆతిథ్య రంగం సహా అన్ని సెక్టార్లకు కృత్రిమ మేధ అనుసంధానమవుతుందని హాఫ్ మన్ అంచనా వేశారు.

టెక్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హాఫ్మన్ గతంలో చేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. సామాజిక మాధ్యమాలకు విపరీత మైన ఆదరణ రానుందని ఆయన ముందే పసిగట్టారు. అలాగే గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని చాలాకాలం క్రితమే అంచనా వేశారు. కృత్రిమ మేధ విప్లవం రానుందని 1997లోనే చెప్పారు.

Tags

Next Story